‘కాంతార’తో కన్నడలో స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి. ఇప్పుడు ‘కాంతార 2’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈలోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకుడు. సితార నుంచి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా కోసం గత మూడేళ్లుగా అశ్విన్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సితార ఇది వరకే రిషబ్ కి రూ.5 కోట్ల వరకూ అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఎగ్రిమెంట్ కుదుర్చుకొంది.
ప్రీ లుక్ లో… ఇదో వీరుడి కథ అని తెలుస్తోంది. కానీ జోనర్ ఏమిటన్నది స్పష్టం చేయలేదు. ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం ఇది స్వాతంత్ర్యం రాకముందు నడిచిన కథ అని తెలుస్తోంది. బ్రిటీష్ వారిపై తొలిసారి తిరుగుబాటు చేసిన కొంతమంది యోధుల కథ ఇది. ఆ బృందానికి హీరో నాయకుడు అవుతాడు. ఆ పోరాటం ఎలా జరిగింది? ఆ తరవాత స్వాతంత్ర ఉద్యమం ఎలా మొదలైంది? అనే పాయింట్ తో ఈ స్క్రిప్టు తయారు చేస్తున్నారు. దేశభక్తిని మిళితం చేసిన విధానం, హీరో క్యారెక్టరైజేషన్, అప్పటి పరిస్థితులు ఇవన్నీ గూజ్బమ్ మూమెంట్స్గా నిలుస్తాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథకు ఓ పుస్తకం ఆధారమని సమాచారం అందుతోంది. కొంత కల్పన, కొంత ఫిక్షన్ మేళవించిన స్క్రిప్ట్ ఇది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. రిషబ్ శెట్టి ‘కాంతార’ పూర్తి చేయగానే ఈ సినిమానే మొదలుపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్ కూడా దాదాపుగా రూ.150 కోట్లని సమాచారం.