అపరిచితుడు సినిమాలో విక్రమ్ నటనలో చూపించే వేరియేషన్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. ఇది సినిమా విక్రమ్ చాలా టేకులు తీసుకుని దీన్ని రక్తి కట్టించి ఉంటారు. కానీ లిక్కర్ స్కామ్ నిందితులు మాత్రం సింగిల్ షాట్ లో.. రియల్ గా అందరి ముందు ఇలాంటి వేషాలు వేసేస్తున్నారు. వారి తీరు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత వేగంగా వేరియేషన్స్ ఎలా మార్చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు.
కోర్టులో ఏడుపులు
రిమాండ్ పొడిగింపు కోసం నిందితుల్ని శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చెవిరెడ్డి ఏడుపులు, పెడబొబ్బలు పెట్టుకున్నారు. తనకేమీ సంబంధం లేదని గగ్గోలు పెట్టారు. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి కూడా ఏడ్చారు. తనకేమీ సంబంధం లేదని .. కేసులో ఇరికించారని చెప్పుకున్నారు. బెయిలివ్వాలన్నారు. ఇతర నిందితులది ఇదే వాదన.
బయటకు వచ్చి పెడబొబ్బలు
ఇక బయటకు వచ్చి పెడబొబ్బల గురించి చెప్పాల్సిన పని లేదు. లోపల జడ్జి ముందు ఏడ్చి.. బయటకు వచ్చి మీడియా ముందు మరో రకమైన నటన ప్రదర్శిస్తున్నారు. తాము భయపడే ప్రశ్నే లేదని.. తమపై కేసులు పెట్టిన వారు అంతు చూస్తామంటున్నారు. తమ ప్రమేయం లేదని దర్యాప్తు అధికారులకూ తెలుసని తామకు తామే చెప్పుకుంటున్నారు. చెవిరెడ్డి అయితే కోర్టుకు తీసుకెళ్లేందుకు బయటకు తీసుకువచ్చిన ప్రతీ సారి నట విశ్వరూపం చూపిస్తున్నారు. లోపల న్యాయమూర్తి ముందు లిక్కర్ కు బానిసయి తన తండ్రి,సోదరుడు చనిపోయారని చెప్పుకుంటున్నారు. బయటకు వచ్చి అంతు చూస్తానని అంటున్నారు.
దర్యాప్తు అధికారులకు బెదిరింపులు
నిందితులు అంతా దర్యాప్తులో అధికారుల్ని బెదిరించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. సిట్ ఆఫీసు ముందే ఇల్లు తీసుకుంటానని.. అందరి అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఇతర నిందితులు కూడా తమ జోలికి వస్తే ఏదో చేస్తామని బెదిరిస్తున్నారు. అవన్నీ రికార్డు చేసి దర్యాప్తు అధికారులు న్యాయమూర్తులకు సమర్పిస్తున్నారు. దొరికిపోయిన తర్వాత ఇన్ని నాటకాలు ఆడుతున్న వారిని చూసి ఊరకనే రాజకీయ నాయకులు అయిపోరని.. స్కాములు చేయరని పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు.