వంద మంది తప్పు చేసిన వాళ్లు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఓ నిజాయితీపరుడికి శిక్షపడకూడదు అనేది భారత న్యాయవ్యవస్థలోని ఓ సూత్రం అని పెద్దలు చెబుతూంటారు. అందుకే శిక్షలు వేగంగా పడవు. కానీ డబ్బుండి, అధికారం ఉన్న వారికి అయితే అసలు పడవు. కేసులు సుదీర్ఘంగా సాగుతూ ఉంటాయి. రకరకాల పిటిషన్లు వేసి.. విచారణకు కూడా రానివ్వరు. చివరికి దర్యాప్తును కూడా ఆపేయగలశక్తి కలిగి ఉంటారు. కానీ న్యాయవ్యవస్థ పవర్ ఎలా ఉంటుందో ప్రజ్వల్ రేవణ్ణపై ఏడాదిలోనే విచారణ జరిపి శిక్ష విధించిన వ్యవహారం చూపించింది. ఈ ఏడాదిగా ఆ ప్రజ్వల్ జైల్లోనే ఉన్నాడు. ఇక ముందు కూడా జైల్లో ఉంటాడు.
జగన్ అక్రమాస్తుల కేసులు తేలేదెప్పుడు ?
దేశంలో కొన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉంటాయి. అయితే చాలా కేసులు న్యాయవ్యవస్థ పని తీరును దుర్వినియోగం చేస్తూ పిటిషన్ల ద్వారా అలా కేసు విచారణను నిలుపుదల చేసుకున్నవే ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఏపీలో జగన్ రెడ్డి.. క్విడ్ ప్రో కో కు పాల్పడిన సీబీఐ, ఈడీ కేసుల్లో ట్రయల్ ఇంత వరకూ ప్రారంభం కాలేదు. చార్జిషీటు దాఖలు చేసి పన్నెండేళ్లు దాటిపోయాయాయి. పక్కా ఆధారాలతో ఉన్న ఈ కేసుల్లో ట్రయల్ ప్రారంభిస్తే వెంటనే తీర్పు ఇవ్వొచ్చు. కానీ ఇందులో నిందితులంతా పవర్ ఫుల్లే. అందుకే ఎక్కడివక్కడ ఆగిపోయాయి. చివరికి నిందితులు కోర్టుకు హాజరు కావడం కూడా మానేశారు.
వివేకా హత్య కేసును తేల్చలేకపోవడం వ్యవస్థలకు మచ్చ
ఇక వివేకానందరెడ్డి హత్య కేసు అయితే వ్యవస్థలకే పెనుమచ్చగా మారింది. ఎలాంటి క్లూ దొరకని హత్యలను సైతం పోలీసులు తమ నేర పరిశోధనా టెక్నిక్ తో సులువుగా చేధించేస్తారు. కానీ అన్నీ ఆధారాలు కళ్ల ముందు ఉన్నా.. ఓ వీఐపీ హత్య కేసును చేధించలేకపోయారు. చివరికి దర్యాప్తును ఆటంకపరచాలని.. అధికారాన్ని దుర్వినియోగం చేశారు. దర్యాప్తు అధికారులపై కేసులు పెట్టారు. వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ఇంత ఘోరమైన వ్యవహారాలకు పాల్పడిన వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారో ఎవరికీ అర్థం కాదు.
నేరం చేయాలనుకునేవాళ్లు భయపడేలా చేయగలగాలి !
చట్టం, న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. తప్పు చేసిన వాళ్లు పవర్ ఫుల్ అయినా తప్పించుకోలేరని.. ప్రజ్వల్ రేవణ్ణ కేసు నిరూపించింది. అయితే ఎక్కడో ఓ చోట.. ఎప్పుడో సారి ఇలాంటి వాటి ద్వారా కాకుండా.. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం కలిగించే , నేరాలు చేయాలని భావించేవాళ్లతో భయం పుట్టించే హై ప్రోఫైల్ కేసులను కూడా త్వరగా పూర్తి చేయాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.ఆ నమ్మకం ప్రజ్వల్ కేసుతో బలపడుతోంది.