పార్లమెంట్ ఉభయసభల్లో చర్చలు జరగడం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు పట్టుబడితే దానికి కేంద్రం అంగీకరించింది. ఉభయసభల్లోనూ చర్చించారు. లోక్ సభలో ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. రాహుల్, ప్రియాంక గాంధీ స్పీచ్‌లు వైరల్ అయ్యాయి. రాజ్యసభలో అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఎలాగైనా పార్లమెంట్ లో చర్చలు జరగడంతో ప్రజలు కూడా ఆసక్తిగా చూశారు. కానీ మళ్లీ సమావేశాలో రొటీన్ అయిపోయాయి. విపక్షాలు బీహార్ లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని సభను అడ్డుకుంటున్నాయి.
పార్లమెంట్ సమావేశాలు విపక్షాలు చెప్పినట్లుగా నడవవు. ప్రభుత్వం చెప్పినట్లే నడుస్తాయి. అలాగని విపక్షాల డిమాండ్ ను కాదనలేదు. కేంద్రం కూడా.. పార్లమెంట్ లో చర్చలు జరగాలని వీలైనంత వరకూ విపక్షాల డిమాండ్లను అంగీకరిస్తోంది. ప్రస్తుతం బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. అదే సమయంలో సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు వేశారు. ఇలాంటి సమయంలో ఎన్నికల నిర్వహణ వ్యవస్థపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్ తో పాటు విపక్షాలు డిమాండ్ చేసి సభను నిలుపుదల చేస్తున్నాయి.
సభ సాగకపోవడంతో ప్రజాధనం వృధా అవుతోంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అన్నింటిపై సమగ్రంగా చర్చించాల్సి ఉంది. కానీ విపక్షాలు ఈ అవకాశాలను వదులుకుంటున్నాయి. సభను స్తంభింపచేసి ప్రజల్లోనూ అసహనానికి కారణం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాల తీరుపై కేంద్రం కూడా అసహనంతో ఉంది. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూండటంతో ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్రపతితో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అన్నదానిపై స్పష్టత లేదు.
విపక్ష పార్టీలు పూర్తిగా రాజకీయ కోణంలోనే రాజకీయాలు చేస్తున్నాయి. దాని వల్ల ప్రజల్లో వారి పోరాటాలకు గుర్తింపు లభించడం లేదు. అదేదో తమ సొంతం కోసం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజా రాజకీయాలు చేసి.. ప్రజల్ని మెప్పిస్తేనే వారి సానుభూతి లభిస్తుందనే విషయాన్ని పట్టించుకోవడం లేదు.