దేశంలో రియల్ ఎస్టేట్ మెరుగుపడుతోందా.. తగ్గిపోతోందా తెలియని పరిస్థితి మార్గెట్ వర్గాలకు ఎదురవుతోంది. మొదటి ఆరు నెలల లెక్కలు చూస్తే.. జరిగిన లావాదేవీల వాల్యూ పరంగా చూస్తే అభివృద్ధి కనిపిస్తోంది. కానీ లావాదేవీలు చూస్తే మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. అంటే ఎక్కువ మంది కొనడం లేదు. కానీ కొనేవాళ్లు భారీగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందన్నమాట.
2025 మొదటి ఆరునెలల్లో దేశంలోని టైర్-1 నగరాల్లో ఇళ్ల విక్రయాలు రూ.3.6 లక్షల మార్కు దాటాయని క్రెడాయ్-సీఆర్ఈ నివేదిక ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.3.3 లక్షల కోట్ల విక్రయాలతో పోలిస్తే తాజాగా 9 శాతం పెరుగుదల కనిపించింది. కానీ యూనిట్ల పరంగా చూస్తే 4 శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది ఇదే కాలంలో 2.74 లక్షల యూనిట్లు అమ్ముడుకాగా, ఈ ఏడాది ఆరు నెలల్లో ఇది 2.54 లక్షలకు తగ్గింది. అంటే కొనుగోలు సామర్థ్యం ఉన్న వారు తగ్గిపోయారు.
ఇళ్ల విలువ ప్రధాన నగరాల్లో భారీగా పెరగడంతో లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేవాళ్లు మాత్రమే ముందుకు వస్తున్నారు. అందుకే విలువలో పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం అమ్మకాల్లో రూ.3.5 కోట్ల కంటే ఎక్కువ ధర గల అల్ట్రా-ప్రీమియం గృహాల వాటానే 34 శాతం ఉంది. అంటే సామాన్యులు .. రూ.50 లక్షల లోపు ఇళ్లను కొనుగోలు చేసేవారు భారీగా తగ్గిపోయారు. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు భారం అయిపోతున్న ట్రెండ్ కనిపిస్తోంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి మరింత గడ్డు పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది.