కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ప్రధానమైన పాత్ర కేసీఆర్‌దేనని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. జూలై 31న నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం ఆ నివేదికను అధ్యయనం చేసి ప్రధానమైన అంశాలతో రిపోర్టు ఇవ్వడానికి మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పది పేజీల రిపోర్టు తయారు కేబినెట్ ముందు ఉంచనుంది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన ప్రతి పనికి కేసీఆరే బాధ్యులని తేల్చారు. ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మార్చడం దగ్గర నుంచి కాంట్రాక్టర్ల ఎంపిక వరకూ అన్ని విషయాల్లో ఆయన ప్రమేయం ఉందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక తేల్చింది. కేసీఆర్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలలో నిబంధనలు పట్టించుకోలేదని తెలిపారు. వ్యాప్కోస్ నివేదికను కూడా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. మొత్తం లోపభూయిష్టంగా కాళేశ్వరం నిర్మాణం జరిగిందని కమిషన్ స్పష్టం చేసింది. కేబినెట్ లో కూడా నిర్ణయాలు తీసుకోలేదని.. పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ లో అనుమతులు కూడా తీసుకోలేదని కమిషన్ నిర్దారించింది.
మొదట కేసీఆర్ అయితే.. తర్వాత అప్పటి నీటి పారుదల మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా కారణం అని తేల్చింది. అలాగే అధికారుల్లో స్మితా సబర్వాల్ నిబంధనలు ఉల్లంఘించారని తేల్చారు. ఇతర ఇంజినీరింగ్ అధికారులను కూడా బాధ్యులను చేశారు. వారిలో ఇప్పటికే ముగ్గుర్ని అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో పెట్టే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ లో క్రిమినల్ చర్యల దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.