రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పడిన బాధలు, చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు, ఇప్పుడు బహిరంగసభల్లో ఇస్తున్న ప్రసంగాలు చూస్తే ఆయన తొందరపడతారేమో అని కొంత మంది కంగారు పడుతూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయాన్ని రాజకీయంగా.. పాలనను పాలనగా చేస్తున్నారు. అదే సమయంలో ఆయన చేయాలనుకున్నది చేస్తున్నారు. పద్దతిగా చేస్తున్నారు. కక్ష సాధింపులన్న ప్రచారం రాకుండా చేస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను చావుదెబ్బ కొట్టడానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. కాళేశ్వరం రిపోర్టు విషయంలో రేవంత్ స్లో అండ్ స్టడీ వ్యూహం బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రజల్లో చర్చకు కాళేశ్వరం రిపోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా నాటడంలో రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సక్సెస్ అయ్యారు. ఇపుడు దాన్ని నిరూపించాల్సి ఉంది. నేరుగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే.. అది బ్యాక్ ఫైర్ అవుతుంది. అందుకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ కు ప్రభుత్వం తరపున సమాచారం ఇచ్చారు. సహజంగానే కేసీఆర్ అన్ని నిబంధనలు ఉల్లంఘించి అంతా తాను అనుకున్నట్లే చేశారు కాబట్టి అదే విషయాన్ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పారు. బాధ్యులెవరో చెప్పారు. ఇక రేవంత్ ఆట ప్రారంభించారు.
అసెంబ్లీలో చర్చ – రేవంత్ మాస్టర్ స్ట్రోక్
కాళేశ్వరం రిపోర్టుపై ప్రాథమికమైన అంశాలను ప్రజల ముందు ఉంచారు. పూర్తి రిపోర్టును ప్రజల ముందు ఉంచుతామని అసెంబ్లీలో అందరి అభిప్రాయాలు వింటామన్నారు. అంటే అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికపై సమగ్రమైన చర్చ జరుగుతుంది. అందులో ఉన్న వన్నీ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకవతకలే. ఎక్కడెక్కడ కేసీఆర్ ను ఇరికించవచ్చో.. ఎక్కడెక్కడ హరీష్ ను రోడ్డున పడేయవచ్చో చూసుకుని మరీ క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తారు. అప్పటికే అసలు విషయాలు అసెంబ్లీ ద్వారా ప్రజలకు చేరిపోతాయి కాబట్టి.. కక్ష సాధింపులన్న ఆలోచనలు.. ఆరోపణలు రావు.
కేసీఆర్ కూడా ఊహించని వ్యూహాలు
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ రిటైర్డ్ చాణక్య అయిపోయారు. ఆయన పార్టిీని గెలిపించలేకపోయారు. పార్టీ పతనాన్ని అడ్డుకోలేకపోతున్నారు. ఆయనను కూడా కార్నర్ చేసే విధంగా రేవంత్ రెడ్డి కొత్త చాణక్యుడిగా అవతరించారు. రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు పన్నుతారో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి ఏం చేయాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా కేటీఆర్ లోని అసహనం.. పరిధులు దాటుతోంది. దాన్ని కూడా రేవంత్ తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. రేవంత్ ఆగి ఆగి.. కొట్టబోయే దెబ్బలను బీఆర్ఎస్ ఎలా కాచుకుంటుందన్నదే ఇప్పుడు అత్యంత కీలకం.