వైసీపీ అధినేత జగన్ రెడ్డి తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. మాములుగా ఆయనకు కొంత మంది బౌన్సర్ల రక్షణ ఉంటుంది. కానీ ఈ సారి పూర్తిగా పోలీసుల్ని పక్కన పెట్టేసి.. తన ప్రైవేటు సైన్యం రక్షణలోనే ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డిని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి సమయంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో లాయర్ల టీములను రంగంలోకి దింపారు. వారు ఇప్పటికే జగన్ రెడ్డిని అరెస్టు చేస్తే… కింది కోర్టు నుంచి పైకోర్టు వరకూ ఎలాంటి పిటిషన్లు వేయాలో రెడీ చేసుకున్నారు. అదే సమయంలో జగన్ రెడ్డికి వ్యవస్థల పనితీరుపై చాలా గౌరవం ఉంటుంది. అందుకే.. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
గతంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఆయన తన తల్లికి అనారోగ్యం పేరుతో కర్నూలులో ఓ వైసీపీ నేత ఆస్పత్రిలో ఉండిపోయారు. ఆస్పత్రి చుట్టూ వందల మంది గూండాల్ని , రౌడీలను ఉంచారు. వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి పహారా కాయించారు. పోలీసులు కూడా తాము అరెస్టు చేయడానికి సహకరించలేమని తేల్చి చెప్పేశారు. దాంతో సీబీఐ అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా జగన్ అదే వ్యూహం పాటించాలని అనుకుంటున్నారు.
తన చుట్టూ ప్రభుత్వ పోలీసుల రక్షణ ఉంటే.. అరెస్టు చేయడానికి వస్తే ఎవరూ అడ్డుకోరని అదే ప్రైవేటు సైన్యం అయితే.. పోలీసుల్ని సైతం నెట్టి వేస్తుందని.. తనను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రైవేటు సైన్యాలు బీహార్ లాంటి రాష్ట్రాల్లో పని చేస్తాయేమో కానీ.. ఏపీ లాంటి చోట్ల వర్కవుట్ అవ్వవని జగన్ ఊహించలేకపోతున్నారు.