కేసీఆర్ను హింసించడానికే కాళేశ్వరం రిపోర్టు పేరుతో కుట్ర చేస్తున్నారని హరీష్ రావు అనుమానిస్తున్నారు. అరెస్టులు ఉండవచ్చని భయపడవద్దని కేసీఆర్ తన పార్టీ నేతలకు కూడా ధైర్యం చెబుతున్నారు. కాళేశ్వరం రిపోర్టులో ఉన్న సీరియస్ నెస్.. కేసీఆర్ పాత్ర గురించి విస్పష్టంగా చెప్పిన వైనం చూస్తే.. అసెంబ్లీలో చర్చల తర్వాత క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉంది. అదే జరిగిదే ఏ 1గా కేసీఆర్ ఉంటారు. తప్పనిసరిగా అరెస్టు చేయక తప్పదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు కీలకం.
కేసీఆర్ను అరెస్టు చేస్తే ప్రజల నుంచి స్పందన వస్తుందా ?
కేసీఆర్ ఉద్యమనాయకుడు. తెలంగాణ ప్రజలందర్నీ కదిలించి స్వరాష్ట్రం దిశగా అందరూ రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు. తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నా కేసీఆర్ రాష్ట్రంలో దిగ్గజ నేత. అయితే ఆయనను అరెస్టు చేస్తే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసినప్పుడు సామాన్య ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం బీఆర్ఎస్ నేతలు కూడా పట్టించుకోలేదు. మరి కేసీఆర్ ను అరెస్టు చేస్తే ఎలా స్పందిస్తారన్నది బీఆర్ఎస్ నేతలకూ అంతు చిక్కడం లేదు.
కక్ష పూరితంగా అరెస్టు చేశారని అనుకుంటేనే ప్రజల సానుభూతి !
రాజకీయ నేతల అరెస్టులను ప్రజలు రెండు రకాలుగా చూస్తారు. ఒకటి నిజంగా అవినీతి లేదా తప్పు చేసి జైలుకెళ్లడం, రెండు కక్ష పూరితంగా అరెస్టు చేయడం. ఏపీలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఎలాంటి విచారణ ప్రక్రియ లేకుండా.. తప్పు ఏం చేశారో చెప్పకుండా రాత్రికి రాత్రి అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టారు. ఈ విషయాలను ప్రజలు నమ్మారు. అందుకే ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది. కానీ కేసీఆర్ విషయంలో రేవంత్ సర్కార్ అలా చేయడం లేదు. ఆయన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారని ప్రజల ముందు పెడుతున్నారు. విస్తృత చర్చ చేస్తున్నారు. అరెస్టులు ఖాయమన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల …కేసీఆర్ ను అరెస్టు చేసినప్పుడు అనుకున్నదేగా అని చాలా మంది సైలెంట్ అయిపోయే అవకాశం ఉంది. రియాక్షన్ కనిపించదు.
సానుభూతి రాకపోతే పార్టీ ఉనికి పెను ప్రమాదం!
బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందా లేదా అన్న విషయమే కీలకం. ఇక్కడ రాదు అని చెప్పడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విపక్ష నేతల్ని వేధించడమే దీనికి కారణం. రేవంత్ రెడ్డిని ఎన్ని సార్లు జైళ్లలో పెట్టారో చెప్పాల్సిన పని లేదు. ఆయన కుమార్తె పెళ్లికి కూడా కొన్ని గంటల పాటే వచ్చి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత డ్రోన్ కేసులో అరెస్టు చేసి కరుడు గట్టిన నేరస్తుల మధ్య పెట్టారని కూడా వాపోయారు. ఇక బండి సంజయ్ కు ఓ ప్రశ్నాపత్నం వాట్సాప్ ఫార్వార్డ్ ను చూపించి అరెస్టు చేశారు. ఇవన్నీ ప్రజల మైండ్ లో ఉన్నాయి. చేసిన వాటికి ప్రతిఫలంగానే జరుగుతున్నాయని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఇలా అనుకుంటే కేసీఆర్ అరెస్టు బీఆర్ఎస్ ఉనికి ప్రమాదం తెచ్చి పెడుతుందన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్ లో ఉంది.
కేసీఆర్ వయసు, ఆరోగ్యం కారణంగా అరెస్టు చేయడం అనేది మంచి నిర్ణయం కాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తే… అరెస్టు చేయకుండానే విచారణ చేసే అవకాశం ఉంది. అదే చేస్తే.. రేవంత్ రెడ్డి మంచితనంపైనే ప్రజల్లో ఎక్కువ చర్చ జరుగుతుంది.