నటుడు సుమన్ వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోనూ ఇప్పుడు ఎన్నికల హడావుడి ఉందని అక్కడి రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానిస్తున్నాయని.. ఆలోచించుకుంటానని చెప్పానన్నారు.
సుమన్ ఎప్పుడూ ఓ గోడ మీద ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా మాట్లాడుతూంటారు. విపక్ష స్థానంలో ఉన్న వారిని విమర్శిస్తూంటారు. ఆయన తీరుతో ఏపీ రాజకీయ పార్టీలు ఆయనపై ఎప్పుడో ఆసక్తి కోల్పోయాయి. మొదటి నుంచి టీడీపీతో కాస్త సన్నిహితంగా ఉండే ఆయనకు.. చాలా కాలం కిందటే రేపల్లె నుంచి పోటీకి ఆఫర్ ఇచ్చారు. అయితే అప్పట్లో ఎందుకో అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఆయన పేరు పరిశీలించాల్సిన అవసరం లేకుండా పోయింది.
కానీ సుమన్ మాత్రం రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనను ఆహ్వానించేందుకు సిద్ధపడలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పాలనను పొగిడారు. టీడీపీ పాలన ఉన్నప్పుడు టీడీపీని పొగుడుతారు. ఇలాంటి రాజకీయ విధానాలతో ఆయన గురించి ఏపీ రాజకీయ పార్టీలు మర్చిపోయాయి కూడా. సినిమాల్లోనూ ఆయన అంత యాక్టివ్ లేరు. ఓ తరం వారికి మాత్రమే ఆయన తెలుసు. ఇప్పుడు ఆయన తాను ఎన్నికలకు ముందు వచ్చి పోటీ చేస్తానంటే.. ఏ పార్టీ కూడా పిలిచి సీటిచ్చే అవకాశాలు ఉండవు. సుమన్ అటు తెలుగు.. ఇటు తమిళ రాష్ట్రాలకు చెందినవారు కాదు. ఆయన కన్నడిగుడు. కానీ తెలుగింటల్లుడు అయ్యాడు.