క్రిష్ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఇప్పటివరకు ఆయన తీసిన ఏ సినిమాకి మరో సినిమాతో పోలిక ఉండదు. ప్రతిసారి ఒక కొత్త నేపథ్యంతో సినిమా తీయడం ఆయన మార్క్. ఈసారి అనుష్కతో ఘాటీ సినిమా చేస్తున్నారు. వేదం తర్వాత క్రిష్–అనుష్క కాంబినేషన్ కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ మరిన్ని ఆశలు రేపుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
బ్రిటిష్ కాలంలో ప్రమాదకరమైన కొండప్రాంతాల్లో రోడ్లు నిర్మించిన తెగ ఘాటి. అయితే ఇప్పుడా సమాజం కొండల్లో డ్రగ్స్ మోసే పనుల్లో చిక్కుకుపోయింది. తప్పు చేస్తున్నామనే గ్రహించి, ఈ చెడు వ్యవస్థకి ఎదురు నిలవడానికి రెడీ అవుతుంది అనుష్క. తన వాళ్లను ఈ ప్రమాదకర వ్యాపారం నుంచి ఎలా బయటకు తీసుకొచ్చింది? దీనికోసం ఎలాంటి పోరాటం చేసిందనేది ట్రైలర్ చాలా ఆసక్తికరంగా చూపించారు.
అనుష్కను మునుపెప్పుడూ చూడని వైల్డ్ అవతార్‌లో కనిపించింది. ఓ సామాన్య మహిళ నుంచి క్రిమినల్, లెజెండ్‌గా మారే పాత్ర ఈ కథకి కీలకం. ‘సీత చేసే లంకా దహనం చూస్తారు’ అనే డైలాగ్ ఆమె క్యారెక్టర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. క్రిష్ జాగర్లముడి యాక్షన్, ఎమోషన్‌తో పాటు కొత్త బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకొని ఈ కథను సిద్ధం చేయడం కొత్త అనుభూతిని కలిగించింది. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో విడుదలవుతున్న ఈ సినిమాకి ట్రైలర్ మంచి జోష్ తీసుకొచ్చింది.