ఏపీ కాంగ్రెస్ ను పట్టాలెక్కించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. కొత్తగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను.. అడ్వయిజరీ కమిటీని నియమించింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ ఈ అడ్వయిజరీ కమిటీ చీఫ్ గా వ్యవహరిస్తారు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల మొదట్లో దూకుడుగానే వ్యవహరించారు. కానీ అంతా ఏకపక్షంగా వ్యవహరించడంతో కొంత మంది వ్యతిరేకమయ్యారు. ఈ పరిణామాలతో వర్గ పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
షర్మిలే జనాకర్షక నేత
అయినా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడు కాస్త ప్రజాకర్షణ ఉన్న నేత ఎవరూ లేరు. అంతో ఇంతో షర్మిలకే ఆ స్థానం ఉంది. షర్మిలను కాదని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే అందర్నీ కలుపుకుని వెళ్లేలా షర్మిలకు మార్గదర్శనం చేసేందుకు ఠాగూర్ మరింత సమయం కేటాయించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై మాణిగం ఠాగూర్‌కు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే బలపడుతుందో ఆయనకు స్పష్టత ఉంది. షర్మిలకూ ఉంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తూండటంతో కార్యకలాపాలు పెంచాలని అనుకుంటున్నారు.
జగన్ పతనమే కాంగ్రెస్ కు బలం
కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీ ఓటు బ్యాంక్. కొత్త వర్గాలను కాంగ్రెస్ ఆకర్షించడం అసాధ్యం . కాంగ్రెస్ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చుకుంటేనే అంతో ఇంతో బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే వైసీపీ అంత నష్టపోతుంది. కాంగ్రెస్ పదిశాతం ఓట్లు తెచ్చుకుంటే వైసీపీ భూస్థాపితం అయిపోయినట్లే. అందుకే ఠాగూర్ ను జగన్ ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తో సఖ్యతకు సిద్ధమేనని సంకేతాలు పంపుతున్న జగన్ ను పట్టించుకోవడం లేదు. ఆయనది గోడ మీద పిల్లి వాటం అని .. ఆయన రాజకీయ జీవితాన్ని ముగించడానికి ప్రయత్నిస్తేనే కాంగ్రెస్ బలపడుతుందని నిర్ణయానికి వచ్చారు.
వేగం పెరగనున్న కాంగ్రెస్ కార్యకలాపాలు
షర్మిల, జగన్ మధ్య పూడ్చలేనంత ఆగాథం ఏర్పడింది. రాజకీయంగా తాను ఏంటో చూపించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. జగన్ రెడ్డి రాజకీయ పతనం అదీ తన ద్వారా జరిగితే ఆమె విజయం సాధించినట్లే అవుతుంది. అందుకే.. పార్టీలో అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజకీయ పరిణామాలను బట్టి వేగంగా కార్యకలాపాలను పెంచే అవకాశం ఉంది.