అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధార పడి ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా టారిఫ్లు వేస్తున్నారు. అవసరం లేని వస్తువుల్ని ఓ దేశంపై ప్రేమతో ఎవరూ దిగుమతి చేసుకోరు. అమెరికా లాంటి స్వార్థపూరిత దేశం అసలు చేసుకోలేదు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు అక్కడి ప్రజల అవసరాల్ని తీరుస్తుంది. అంతే కానీ భారత్ ను బతికించడానికి దిగుమతి చేసుకోవడం లేదు. ఈ విషయం ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారు.
దేశ ప్రయోజనాలే ముఖ్యం
అమెరికా టారిఫ్లపై భారత్ అంత కంగారు పడాల్సిన పని లేదని అనుకుంటోంది. నింపాదిగా వ్యవహరిస్తోంది. కానీ ట్రంప్ చేస్తున్నది తప్పు అని స్పష్టంగా చెబుతోంది. అదే సమయంలో తాము ట్రంప్ చేస్తున్న లాంటి పిచ్చి పనులు చేయలేమని .. పిచ్చోడితో పోరాటం అనేది తమ అభిమతం కాదని నిరూపిస్తోంది. అంటే ప్రతీ కార సుంకాలు విధించబోమని స్పష్టం చేసింది. ఇప్పుడు ఉన్న టారిఫ్లు కొనసాగుతాయని అర్థం. ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలు నష్టపోతారా.. ఇండియా ప్రజలా అన్నది తర్వాత విషయం కానీ.. దేశ ఆత్మగౌరవం కాపాడుకోవడం ముఖ్యం. భారతీయుల వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యం.
అమెరికాకు ఎగుమతులు తగ్గుతాయి – కానీ కొత్త మార్కెట్లు వస్తాయి !
డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు భారతదేశంపై ప్రభావం చూపుతాయి, కానీ అవి సవాళ్లతో పాటు అవకాశాలను కూడా తీసుకొస్తాయి. గార్మెంట్స్, లెదర్, ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి శ్రమ ఆధారిత రంగాలు టారిఫ్ల కారణంగా అమెరికా మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ఇవి డిమాండ్ ను తగ్గిస్తాయి. స్టీల్, అల్యూమినియం , ఆటోమొబైల్, ఆటో విడిభాగాల ఎగుమతులు తగ్గవచ్చు. ఫార్మాస్యూటికల్ రంగం, దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన నాన్-పేటెంటెడ్ ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది, టారిఫ్ల వల్ల ఈ రంగంలో డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది. కానీ భారతీయ ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాకపోతే అక్కడ అల్లకల్లోలం ఏర్పడుతుంది.
భారత్ సింపుల్ స్ట్రాటజీ
టారిఫ్లు ఎంత ఎక్కువ వేసినా భారత్ కు ఇబ్బంది తాత్కాలికమే అవుతుంది. కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సవాళ్లు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికి, భౌగోళికంగా వైవిధ్యభరితమైన మార్కెట్లను అన్వేషించడానికి అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ట్రంప్ టారిఫ్లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశం కల్పిస్తాయి. అమెరికాపై ఆధారపడే వాణిజ్యం కూడా తగ్గితే భవిష్యత్ లో భారత్ ను బ్లాక్ మెయిల్ చేయడానికీ అవకాశం ఉండదు. అందుకే ట్రంప్ ను అలా వదిలేసి .. భారత్ తన పని తాను చూసుకోవాలన్న నిర్ణయం పరఫెక్ట్ గా ఉంటుంది.