అనుష్క సినిమాకు సంబంధించిన అప్ డేట్ గురించి ఆమె ఫ్యాన్స్ చాలా కాలంగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు చిత్రం ‘ఘాటీ’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. కానీ విడుదల ఆలస్యం అవుతోంది. తాజాగా సెప్టెంబరు 5న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ప్రచార పర్వానికీ తెర లేపారు. తాజాగా ఓ ట్రైలర్ విడుదల చేశారు.
‘ఘాటీ’ ట్రైలర్ ఆసక్తి కలిగించేలానే కట్ చేశారు. ముఖ్యంగా అనుష్క పాత్ర చుట్టూనే కథంతా తిరగబోతోందన్న సంగతి అర్థమైంది. ‘ఘాటీ’ అంటే ఏమిటన్న కన్ఫ్యూజ్ చాలామందిలో ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్‌తో దానికి ఓ సమాధానం దొరికినట్టైంది. ట్రైలర్ లో కథేమిటి? జోనర్ ఏమిటన్నది రివీల్ చేశారు. అనుష్క రోల్ చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు క్రిష్. ట్రైలర్లో యాక్షన్‌కి పెద్ద పీట వేశారు. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ యాక్షన్ బరిలోకి దిగితే చూడ్డానికి కొత్తగా ఉంటుంది. కేజీఎఫ్, పుష్పలాంటి కథల్ని హీరోయిన్ ఓరియొటెడ్ కోణంలో రాసుకొంటే ఎలా ఉంటుందో… ఘాటీ అలా అనిపించింది.
అనుష్క ఈమధ్య చాలా బొద్దుగా అయిపోయిందని, అందుకే బయటకు రావడానికి ఇష్టపడడం లేదన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ట్రైలర్ లో మాత్రం అనుష్క ఇదివరకటిలానే స్లిమ్ గా కనిపించింది. బహుశా వీఎఫ్ఎక్స్ మహిమ అనుకోవాలి. అనుష్క నిజంగానే అంత స్లిమ్ గా మారిపోతే.. ఫ్యాన్స్‌కు అంతకు మించిన ఆనందం ఏముంటుంది?
సెప్టెంబరు 5న `ఘాటీ`కి గట్టి పోటీ వుంది. ఓవైపు తేజా సజ్జా ‘మిరాయ్’ విడుదల కాబోతోంది. తమిళం నుంచి `మదరాసీ` సినిమా వస్తోంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. శివకార్తికేయన్ హీరో. `భాగీ 3` కూడా ఇదే రోజున విడుదల అవుతోంది.