ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారు. తమ పరిశీలనలో తేలిందంటూ కర్ణాటకలోని మహదేవపురా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అక్రమాలు అంటూ బయట పెట్టారు. దాన్ని ఆయన ఖచ్చితం అని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కానీ ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ప్రకటించినవి వాస్తవాలేనని చెప్పి ఫిర్యాదు చేయాలని కోరింది. ఆ పనిచేయడానికి రాహుల్ సిద్ధంగా లేరు. కానీ ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై క్లారిటీ ఇస్తుంది. కానీ లాజికల్ గా ఆలోచిస్తే.. రాహుల్ గాంధీని ఆయన సలహాదారులు తీవ్ర స్థాయిలో మిస్ లీడ్ చేస్తున్నారని సులువుగా అర్థమైపోతుంది.
కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలో ఓటర్ల జాబితా అక్రమాలంటారా ?
రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అక్రమాల గురించి హర్యానా లేదా మహారాష్ట్రల్లోని జాబితా తీసుకుని వాటిని వివరిస్తే బాగుండేది. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ ఘనవిజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికలలోనూ మరీ తీసిపోయే ఫలితాలు సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న.. విజయాలు సాధించిన చోట ఎన్నికల జాబితాలో అక్రమాలు అంటూ ఓ జాబితా బయట పెట్టడం… అతి పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
పట్టణ ప్రాంతంలో ఓటర్ల జాబితాలో అలాంటి విచిత్రాలు కామన్ !
రాహుల్ గాంధీ చెప్పిన మహదేవ్ పురా అసెంబ్లీ నియోజకవర్గం పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతం. బెంగళూరు అంటే ఉపాధి కేంద్రం. దేశం నలుమూలల నుంచి వచ్చి అక్కడ స్థిరపడతారు. ఓటర్లుగా నమోదు చేసుకుంటారు. తమ సొంత ప్రాంతాల్లో ఓట్లు ఉన్నా అదే పని చేస్తారు. అందుకే మెట్రో నగరాల్లో ఓటింగ్ ఎప్పుడూ యాభై శాతం వరకూ రాదు హైదరాబాద్‌లోనూ అంతే. మహదేవ్ పురాలో ఉన్న ఆరున్నర లక్షల మంది ఓటర్లలో లక్ష ఫేక్ అని రాహుల్ అన్నారు. అందులో ఎన్ని నిజాలు ఉన్నాయో విచారణలో తేలుతాయి కానీ.. అది ఓటర్ల జాబితాలో లోపాలు అవుతాయి కానీ.. ఆ ఓటర్లు ఫలితాలను మార్చలేరు. హైదరాబాద్ లో ఓటర్ల జాబితాలను తిరగేసినా అలాంటి విచిత్రాలు జరుగుతాయి.
రాహుల్ కు పోలింగ్ వ్యవస్థపై అవగాహన లేదా ?
సాయంత్రం ఐదు తర్వాత రిగ్గింగ్ చేస్తున్నారని రాహుల్ ఆరోపణ. కానీ అలా చేయాలంటే.. కొన్ని వేల మంది భాగస్వామ్యం కావాలి. ఎన్నికల ప్రక్రియలో అది అసాధ్యం. ఎందుకంటే సిబ్బందికి కూడా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. నిజాయితీ ఉన్న వాళ్లూ ఉంటారు. అదే సమయంలో పోలింగ్ వ్యవస్థలో కాంగ్రెస్ ఏజెంట్లూ ఉంటారు. కర్ణాటక లాంటి బలమైన క్యాడర్ ఉన్న రాష్ట్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో తమ ప్రతినిధి.. ఈవీఎంకు సీల్ వేసే వరకూ ఉంటారు. మరి రిగ్గింగ్ ఎలా జరుగుతుంది..?
రాహుల్ గాంధీ ఆరోపణలు చూస్తూంటే ఆయన తమ ఓటములకు ఈసీ కారణం అని నిందిద్దామనుకుంటున్నారు. ఆయన సలహాదారులు.. మీ చేతకానితనం కన్నా ఈసీదే తప్పని చెప్పడం మంచిదని.. ప్రచారం చేయడం మంచిదని సలహా ఇచ్చారేమో కానీ ఇలా చేస్తున్నారు. దీని వల్ల .. రాహుల్ గాంధీ ఇమేజ్ మరింత మసకబారుతుంది తప్ప.. ఏ ప్రయోజనమూ ఉండదు.