అయ్యా.. వైసీపీ అభ్యర్థికి ఓటేయండి.. అని ధర్మవరంలో ఓడిపోయిన రీల్స్ స్టార్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పులివెందులలో ఓటర్లను బతిమాలుతున్నారు. ఈ దృశ్యం చూసి చాలా మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఇంత కంటే అవమానం ఏముంటుందని దిగులుపడుతున్నారు. అసలు పులివెందుల జడ్పీటీసీలో ప్రచారం చేయాల్సిన అవసరం రావడమే ఓ పెద్ద అవమానం అనుకుంటే.. ఇతర నేతల్ని తీసుకొచ్చి వారితో ఓటర్లను బతిమాలించుకోవడం ఇంకా పెద్ద చేతకానితనంగా మారింది.
కడప జిల్లా ఇంకా చెప్పాలంటే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో దశాబ్దాలుగా వేరే పార్టీల జాడ లేదు. వైఎస్ సకుటుంబం రాజకీయం అలా చేసింది. కానీ వారు ప్రజలకు మంచి చేశారా.. భయపెట్టి అలా ఉంచుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. దశాబ్దాలుగా వారి గుప్పిట్లో ఉన్న ప్రాంతంలో వారికి మంచి చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు. భయపెట్టి తమతో ఓట్లు వేయించుకుంటే.. వారికి స్వేచ్ఛ వచ్చినప్పుడు అదే ఓటు అనే ఆయుధంంతో పొడుస్తారు. అలాంటి పరిస్థితి వస్తుందేమో అని వైసీపీ భయపడుతోంది.
గత జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్క పులివెందులలో కాదు మొత్తం 52 జడ్పీటీసీ స్థానాల్లో 49 ఏకగ్రీవం చేసుకున్నారు. ఇప్పుడు పులివెందులలో పోటీ చేసి.. దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం.. పులివెందులలో తమ పార్టీ పరిస్థితి ఇంతకు దిగజారిపోయిందని అర్థమైతే ఇక వైసీపీ క్యాడర్ కు ఇక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ? . ఇప్పుడు అదే జరుగుతోంది.
పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓడిపోవడం ఖాయమని .. ఓటమికి కారణాలు వెదుక్కున్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. పులివెందుల జడ్పీటీసీ ఓడితే ఎంత.. గెలిస్తే.. ఎంత అని పార్టీ నేతలతో చెప్పిస్తోంది. కానీ.. ఓడితే ఏం జరుగుతుందో జగన్ కు బాగా తెలుసు. అందుకే ప్రజల్ని ఓట్లేయనివ్వకుండా చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఎంతో కాలం అణచివేయలేరు.. అది ఈ ఎన్నికలతో నిరూపితమయ్యే అవకాశం ఉంది.