రష్యా నుంచి చమురు కొంటున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై మరో 25 శాతం సుంకాలు విధించారు. భారత్ రష్యా నుంచి చమురు కొని వేరే దేశాలకు అమ్మి లాభం తెచ్చుకుంటోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశానికి పెద్దగా ప్రచారం రాలేదు. నిజానికి రష్యా నుంచి భారత్ కొంటున్న చమురును పూర్తి స్థాయిలో దేశ ప్రజలు వాడటం లేదు. అత్యధిక భాగం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది.
భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి, ఆ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకోవడం భారత్ గణనీయంగా పెంచింది. 2022లో ఈ దిగుమతులు 0.2 శాతం మాత్మరే ఉన్నాయి. 2025 నాటికి 35-40 శాతం వరకు పెరిగాయి.
అయితే భారత ప్రభుత్వం ఈ చమురు దిగుమతి చేసుకోవడం లేదు. ప్రైవేటు సంస్థలు చేసుకుంటున్నాయి. ప్రధానంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జామ్నగర్ రిఫైనరీ ద్వారా జూలై 2025లో రోజుకు 6.18 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసింది. రిలయన్స్ మొత్తం దిగుమతుల్లో 57 శాతం . ఈ శుద్ధి చేసిన ఉత్పత్తులను, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటివి, యూరప్, అమెరికా సహా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. 2025లో భారత్ సుమారు 44.4 బిలియన్ డాలర్ల విలువైన శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసిందని గణాంకాలు చెపుతున్నాయి.
భారత్ ఎవరి దగ్గర ఏం కొనాలనేది అమెరికా డిసైడ్ చేయలేదు. వారి ఒత్తిడికి తలొగ్గాల్సిన పని లేదు. కానీ రష్యా నుంచి కొనే చమురు వల్ల ప్రయోజనం పూర్తిగా ప్రజలకు దక్కడం లేదు. కానీ ఆ పేరుతో ట్రంప్ విధించిన టారిఫ్లు మాత్రం ప్రజలందరూ భరించాల్సిందే.