ఫోన్ ట్యాపింగ్ అంశంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ మనస్థాపానికి గురయ్యారు. వెంటనే బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపుతున్నానని ట్విట్టర్ లో ప్రకటించారు. రెండు రోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా.. బండి సంజయ్కు ఇంటెలిజెన్స్ పనితీరు గురించి అవగాహన లేదని మండిపడ్డారు.
బండి సంజయ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను నీచమైనవని, ధర్డ్ క్లాస్ వ్యాఖ్యలన్నారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలలో “ఒక్క చిన్న రుజువైనా” ఉంటే దానిని సమర్పించాలని KTR సవాల్ చేశారు. 48 గంటల్లోగా బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని KTR పేర్కొన్నారు. బండి సంజయ్ “రాజకీయంగా ప్రాధాన్యత కోసం చీప్ డ్రామా” చేస్తున్నాడని ఆరోపించారు. చివరిలో ఢిల్లీ బాసుల చెప్పుల మోస్తాడని కూడా మండిపడ్డారు.
ఇటీవలి కాలంలో కేటీఆర్ ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరిస్తున్నారు. ఎంత మందికి ఇచ్చారో తెలియదు కానీ.. ఆ నోటీసుల సంగతి ఏమైంది..తదుపరి ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు. సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు చూపించారని బండి సంజయ్ చెప్పారు. అలాగే బండి సంజయ్ కూడా కొన్ని ఆధారాలు తీసుకెళ్లి ఇచ్చారు. ఇలాంటి నోటీసుల ద్వారా బండి సంజయ్ లేదా మరో రాజకీయ నేత ..తనపై ఆరోపణలు చేయకుండా ఉంటారని కేటీఆర్ అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదేమో !