కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాల అంశంపై పోరాడుతున్నారు. ఓటర్ల చోరీ అంటున్నారు కానీ అవి .. ఎక్కడా అర్హులైన ఓటర్లకు ఓట్లు లేవని చెప్పడంలేదు. కానీ డబుల్, త్రిబుల్ ఓట్ల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. కచ్చితంగా ఇదే సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంది. దీన్ని సరి చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. బీహార్ లో ఈసీ చేస్తున్నది కూడా అదే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి ఓటర్ల జాబితాను సంస్కరిస్తున్నారు. కానీ అక్కడ ఓటర్లను తీసేస్తున్నారని గగ్గోలు పెడుతున్న రాహుల్… ఇప్పుడు ఓటర్ల జాబితాలో మూడు, నాలుగు ఎంట్రీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఓటర్ల జాబితాలను పూర్తి స్థాయిలో సంస్కరించేందుకు దేశమంతా SIR ప్రక్రియ చేపట్టాలనే దానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ ప్రకటించిన లిస్టులో మీడియా ఫ్యాక్ట్ చెక్
మహదేవపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ బయట పెట్టిన అంశాలపై మీడియా ఫ్యాక్ట్ చెక్ చేసింది. అయితే అవన్నీ మేజర్ సిటీల్లో ఓటర్ జాబితాలో ఉండే సమస్యలే. ఓ చిన్న ఇంట్లో ఎనభై మంది ఓటర్లను చూపిస్తున్నారని రాహుల్ అన్నారు. అక్కడికి వెళ్లి మీడియా చెక్ చేస్తే అది నిజమని తేలింది. కానీ అక్కడ ఓటర్లెవరూ లేరు. ఎందుకంటే లేరంటే వారంతా వలస కూలీలు. గుర్తింపు కార్డు కోసం రెంటల్ అగ్రిమెంట్ తో ఓటు నమోదు చేసుకుంటారు. మరో చోట ఉపాధి దొరికగానే వెళ్లిపోయారు. కానీ ఓటర్ జాబితాలో పేరు అలాగే ఉంది. మరో కేసులో.. ఓ వ్యక్తి బెంగళూరులోనే ఉన్నాడు. కానీ గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఓట్లు నమోదు చేయించుకున్నాడు. ఆ ఓట్లు తొలగించలేదు.
ఓటర్ జాబితాలో లోపాలపై ఎన్నో కళ్లుగా విమర్శలు
ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, ఫేక్ ఓట్లు ఇలా చాలా ఉంటాయి. నగరాల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఉపాధి కోసం వచ్చిన వారు ఓటు నమోదు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఓట్లు నమోదు చేసుకుంటారు. ఇలాంటి లోపాల కారణంగానే సిటీల్లో యాభై శాతం కూడా పోలింగ్ జరగదని చెబుతూంటారు. ఎందుకంటే ఓటు నమోదు చేసుకుని పోయినవాళ్లు ఆ సంగతి మర్చిపోతారు. ఇంకో చోట ఓటు నమోదు చేసుకుంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా చేయడానికి ఈసీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అడ్డుకుంటూనే ఉన్నారు.
ఆధార్‌తో అనుబంధానం చేయడమే మార్గం !
ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేయడమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ఓటర్ కార్డుతో అనుసంధానం చేయాలి. ఆధార్ ఉండి ఓటర్ కార్డు లేని వాళ్లకు అది ఆటోమేటిక్ గా జారీ అయ్యే విధానం తీసుకు రావాలి. రెండు, మూడు ఓట్లు ఉంటే ఆధార్ అనుసంధానంతో తెలిసిపోతుంది. అలాగే.. అర్హత లేని ఓటర్లు, రోహింగ్యాలు, అక్రమ వలసదారులందరి ఓట్లను తీసేయాలి. కుట్ర పూరితంగా వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తే శిక్షించాలి.
రాహుల్ చేస్తున్నది మంచికే !
రాహుల్ గాంధీ తన చేతకాని తనాన్ని ఈసీ మీదకు నెట్టేసి.. సరిగ్గా ఓటర్ల జాబితాలు ఉండి ఉంటే.. తాము గెలిచే వాళ్లమని అనిపించాలని అనుకుంటున్నారు. కారణం ఏదైనా ఈసీ ఎన్నికల జాబితాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళించాల్సిన అవసరం కనిపిస్తోంది. అదే గ్రామాల్లో అయితే ఎవరు ఎక్కడి ఓటర్లో తెలిసిపోతుంది. కానీ పట్టణాల్లో అలా కాదు. ఈ విషయంలో రాహుల్ పోరాటం మెచ్చుకోవాల్సింది. ఓటర్ల జాబితాలను SIR ప్రక్రియతో ప్రక్షాళన చేయాల్సిందే.