తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువనాయకుల పరిస్థితి ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీలో మోత అన్నట్లుగా మారింది. సొంత చెల్లెళ్లు రాఖీలు కట్టేందుకు సిద్ధంగా ఉండరు కానీ.. బయట నుంచి ఇతరులు మాత్రం వచ్చి .. మా అన్న మహానుభావుడు అని రాఖీలు కట్టేస్తూ ఉంటారు. సొంత చెల్లికే న్యాయం చేయని వాడు బయట వారికేం చేస్తూంటారని వారి ప్రత్యర్థులు విమర్శలు చేస్తూంటారు. ఈ సమస్యను వారు తెలివిగా పరిష్కరించుకోలేక రోడ్డుపై పడిపోతున్నారు. ఫలితంగా ఈ అన్నల ఇమేజ్ మసకబారిపోతోంది.
సొంత మీడియాలోనూ చెల్లెళ్లకు చోటు లేదు !
రాఖీ పండుగ వస్తే సొంత మీడియాలో అన్నాచెల్లెళ్ల ఆత్మీయత గురించి కుప్పలుకుప్పలుగా కథనాలు కనిపించేవి. ప్రతి పేజీలోనూ వారిద్దరి ఫోటోలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అనుబంధాలు కనిపించడం లేదు. చెల్లి ఫోటోలు పత్రికల్లో, టీవీల్లో కనిపించకుండా బ్యాన్ చేసేశారు. ఇక సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పే అవకాశం కూడా లేదు. కేటీఆర్ రాఖీ ముందు రోజు.. లగచర్ల నుంచి ఓ మహిళను పిలించుకుని రాఖీ కట్టించుకున్నారు. రాఖీ రోజు ఊళ్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ రెడ్డి కి రాఖీ కట్టడం కాదు కదా ఇప్పుడు ఆయన నీడ కూడా సహించేందుకు షర్మిల సిద్ధంగా లేరు.
ఏవీ నాటి అనుబంధాలు – అన్నీ ఫేకేనా ?
సాక్షి పత్రికలో అన్నీ బాగున్న రోజుల్లో జగన్, షర్మిల అనుబంధం గురించి వచ్చే కథనాలు చదివితే పాలకులకు కళ్లు చెమర్చుతాయి. జగన్ రెడ్డి కి చెల్లి అంటే అంత ఇష్టమా అని వైసీపీ క్యాడర్ అనుకునేవారు. కానీ అసలు అవన్నీ సాక్షిలో లక్షలకు లక్షలు జీతాలు ఇచ్చి చేయి తిరిగిన రచయితలతో రాయించుకున్న కాల్పనిక కథలు అని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. అసలు జగన్ కు.. తల్లి, చెల్లి అనే సెంటిమెంట్ లేదని వారి పై ఆస్తుల కోసం కోర్టుకెళ్లినప్పుడే తేలిపోయింది. సోషల్ మీడియాలో వారి క్యారెక్టర్లపై నిందలు వేయడం.. చెల్లి చీర రంగు గురించి మాట్లాడినప్పుడే ఆయన ఎంత ఘోరమైన మనస్తత్వం ఏమిటో ప్రజలకు తేలిపోయింది. ఆయన రాఖీ పండుగ అంటే ఇప్పుడు అసహ్యించుకుంటారు.
రాజకీయ స్వార్థం కోసం కుటుంబ బంధాలను వదిలేసిన నేతలు
కేటీఆర్, జగన్ ఇద్దరూ రాజకీయ, ఆస్తుల స్వార్థాల కోసం సొంత సోదరీమణుల్ని వదిలేశారు. కవిత రాజకీయంగా తనకు ప్రాధాన్యత కోరుకున్నారు. కానీ తనకు అడ్డం ఉండకూడదని కేటీఆర్ అనుకుంటున్నారు. జగన్ రెడ్డి .. తనకోసం విపరీతంగా కష్టపడిన చెల్లికి చిన్న పదవి ఇవ్వలేదు. తండ్రి కి ఇచ్చిన మాట ప్రకారం అయినా ఆస్తులు పంచలేదు. ఇలాంటి వాటి కోసం చెల్లెళ్లను రోడ్డుపై పడేసిన అన్నలు… మిగిలిన మహిళలందరికీ మేలు చేస్తామని.. వారికి గొప్ప అన్నగా ఉంటామని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు .. ముఖ్యంగా మహిళలు ఎలా నమ్ముతారు ?