ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు ఈ సారి చంద్రబాబు చేపట్టిన P4 పథకంపై చిరాకేసింది. దానిపై ఏకంగా ఓ ఆర్టికల్ రాసి పడేశారు. పేదరికాన్ని నిర్మూలిస్తానని చంద్రబాబు నేల మీద సాము చేస్తున్నారని అసలు అది ప్రకృతి విరుద్ధమని చెప్పేశారు. ధనవంతుడు , పేదవాడు అనడానికి కొలమానాలేమిటని ప్రశ్నించేశారు. పేదవాళ్లను ఆదుకోవాలని పెద్దవాళ్లను పీడిస్తున్నారని.. అందరికీ టార్గెట్లు పెడుతున్నారని తేల్చేశారు.
ఒక్క సారిగా P4పై ఆర్కేకు ఎందుకు కోపం వచ్చిందో కానీ .. ప్రభుత్వం కేవలం ఆర్గనైజర్ గా ఉండి రూపాయి ఖర్చు పెట్టని పథకంపై ఎందుకు ఇంత ఆవేశపడ్డారో ఆయనకే తెలియాలి. పొరపాటున ఆయనను కూడా ఏదైనా కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆయనను కూడా సంప్రదించారేమో కానీ.. చిరాకేసింది. అందుకే రాసి పడేశారు.
పేదరికాన్ని నిర్మూలించడం ప్రకృతి విరుద్ధమని.. అసలు పేదరికం,ధనవంతులు అనేదానికి కొలమానాలేమిటని ఆయన చెప్పుకొచ్చారు. పేదరికం నుంచి బయటపడేస్తామంటే.. వాళ్లకు ఇళ్లు, కార్లు కొనివ్వడం కాదు. కేవలం వారు తమ బతుకుల్ని బాగు చేసుకోవడానికి అవసరమైన సహకారం అందించడం. ఆర్థికంగా ఉండొచ్చు.. అవకాశాల రూపంలో ఉండవచ్చు లేదా.. సలహాల రూపంలో ఉండవచ్చు. మరి ధనవంతులు ఎవరని ఆర్కే ప్రశ్నించారు. ఇతరులకు సాయం చేయాలన్న గుణం ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతుడే. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయండని .. దానగుణం ఎంతో మంచిదని మన పిల్లలకు నేర్పుతాం. ఇలాంటి గుణం ఉన్నవారంతా ధనవంతులే. ఆ మాత్రం ఆర్కే అర్థం చేసుకోలేకపోయారు.
P4 పథకం మంచి కాన్సెప్ట్. పేదరికంలో ఉన్న వారికి అవగాహన లేక..సరైన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు. చిన్నపాటి ఆర్థిక సహకారం ఉంటే తమ కుటుంబాలను మెరుగుపర్చుకుంటారు. ఓ రేసులో పాల్గొంటే…. కాస్త మెరుగైన విద్యాసౌకర్యాలు ఉన్న వారు కారులో రేసులో పాల్గొన్నట్లు.. కాస్త తక్కువ విద్యా సౌకర్యం అందుకున్న వారు బైకుతో పాల్గొన్నట్లు.. కానీ పెద్దగా ఎలాంటి విద్యా సౌకర్యం లేకుండా ఉన్న వారు ఒంటి కాళ్లతో రేసులో పాల్గొన్నట్లు. ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఒంటి కాలితో రేసులో పాల్గనే వారిని కూడా సమాన స్థితిలో పోటీ పడేలా చేయాలంటే.. ఖచ్చితంగా p4 లాంటి పథకాలు అవసరం.
అయినా ఆర్కే ఈ పథకంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాసిన ఈ ఆర్టికల్ వల్ల ఆ పథకం పై ప్రభావం పడుతుంది. ఎన్నో కుటుంబాలకు మార్గనిర్దేశం పోయే చాన్స్ ఉంది. అయినా ఇందులో ఎవరికో టార్గెట్లు పెడుతున్నారని.. అలాంటివి వద్దని ..లోపాలు సరి చేసుకుంటే మంచి కాన్సెప్ట్ అని చెప్పాల్సింది పోయి.. అసలు ఇదే పెద్ద వేస్ట్ అని చెప్పడం ఆశ్చర్యకరమే.