భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఢిల్లీలో తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తరచూ ఆయన ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హతా పిటిషన్ వేయడానికి వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్ ఏం తీర్పు వచ్చిందో చూశారు. ఇప్పుడు మళ్లీ మరో పిటిషన్ వేయడానికి స్వయంగా వెళ్లాల్సిన పని లేదు. కానీ వెళ్తున్నారు.
అసలు అజెండా న్యాయనిపుణులతో చర్చలు !
సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్సీలపై పిటిషన్లు వేసి వారిపై అనర్హతా వేటు వేసేలా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే న్యాయనిపుణులతో సంప్రదింపులు కేవలం ఆ పిటిషన్ అంశంపైనే కాదని.. తమను చుట్టుముడుతున్న కేసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్నదానిపైనా చర్చిస్తారని అనుకోవచ్చు. కాళేశ్వరం రిపోర్టు న్యాయపరంగా నిలవదని బీఆర్ఎస్ వాదిస్తోంది. దాన్ని కోర్టులో సవాల్ చేసే అంశపైనా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు.
రాజకీయ రహస్య సమావేశాలుంటాయా?
కేటీఆర్ గతంలోనూ ఇలాంటి ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేలపై అనర్హతా పిటిషన్ల కోసం వచ్చామని చెప్పేవారు. అయితే పనిలో పనిగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మాట్లాడటానికి వచ్చారని తర్వాత తెలిసింది. సీఎం రమేష్ ను మధ్యవర్తిగా ఉంచుకుని పార్టీని విలీనం చేయాలని ప్రయత్నించారు. ఈ విషయం సీఎం రమేష్ బయట పెట్టే వరకూ ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు కూడా అలాంటి సమావేశాలు ఉంటాయని భావిస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడానికి లాయర్లతో భేటీలే అజెంటా కాదని..సీక్రెట్స్ ఉన్నాయని భావిస్తున్నారు.
బీజేపీతో బంధంపై తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందా ?
బీజేపీతో బంధంపై బీఆర్ఎస్ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విలీన వార్తలు విజృంభిస్తున్న సమయంలో.. బీజేపీని పల్లెత్తు మాట అనుకుండా రాజకీయం చేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేస్తున్నారు. ఓ వైపు బీజేపీ చేరికల్ని ప్రోత్సహిస్తూండటం.. మరో వైపు తమ ప్రతిపాదనలపై స్పందన లేకపోవడం బీఆర్ఎస్ పెద్దల్ని ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు. కేటీఆర్ ఢిల్లీ పరిణామాల తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది.