రాఖీ రోజు కవిత తన సోదరుడు కేటీఆర్ కు మెసెజ్ చేశారు. రాఖీ కట్టేందుకు వస్తానన్నా అని అడిగారు. కానీ కేటీఆర్ చాలా ఆలస్యంగా.. నాట్ అవైలబుల్ అని రిప్లై ఇచ్చారు. ఈ విషయాన్ని కవిత వర్గీయులు మీడియాకు లీక్ చేశారు. లగచర్ల నుంచి వచ్చిన మహిళలతో రాఖీ ముందు రోజే రాఖీలు కట్టించుకున్న కేటీఆర్ ఆ సాయంత్రం ఎక్కడికో వెళ్లారు. దుబాయ్ అని కొందరు.. ఢిల్లీ, బెంగళూరు అని కొందరు చెబుతున్నారు.
కవిత రాజకీయంగా విబేధించారు. కానీ కేటీఆర్ ను కుటుంబ పరంగా దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇటీవల కేటీఆర్ పుట్టినరోజున.. హ్యాపీ బర్త్డే అన్నా అని ఆప్యాయంగా ట్వీట్ చేశారు. ఏ సందర్భంలో అయినా కవిత కుటుంబ పరంగా కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఓ టీవీ చానల్ కు ఇంటర్యూ ఇచ్చినప్పుడు రాఖీ కట్టడానికి వెళ్తానని కూడా చెప్పారు. రాజకీయంగా ఆయన నాయకత్వాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
కేటీఆర్కు రాజకీయం వేరని.. కుటుంబం వేరని నిరూపించే మంచి అవకాశాన్ని కవిత ఇచ్చారు. కవితను రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి ఆహ్వానించి ఉంటే.. ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లేవి. అది రాజకీయంగానూ ఉపయోగడేవి. కేటీఆర్..తన సోదరిని బాగా చూసుకుంటున్నా.. ఆమె మాత్రమే తొందరపడుతున్నారని వ్యతిరేకిస్తున్నారని అనే భావన ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండేది. కానీ కేటీఆర్ తన సోదరి తనను రాజకీయంగా విబేధించారు కాబట్టి దూరం చేసుకోవాలన్నట్లుగా ఉన్నారు.