ప్రత్యర్థి ఎవరో సరిగ్గా ఎంచుకోలేని వారు ఆటలో గెలవడం సంగతి అటుంచితే అసలు రేసులో లేకుండా పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ యుద్ధం ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థ అయిన ఈసీపై రాజకీయ యుద్ధం చేయడం కంటే మూర్ఖత్వం ఉంటుందా?. తమకు తెలిసిన విషయాలే నిజం అని రాజకీయ ఆరోపణలు చేస్తూ పోతే రాజకీయంగా లాభం కలుగుతుందా ?
ఈవీఎం లోపాలా ? ఓటర్ల జాబితాలా ?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు వచ్చినప్పటి నుంచి ఓడిపోయిన ప్రతి ఒక్కరూ తమ ఓటమి కారణం ఈవీఎంలే అంటున్నారు. గతంలో బీజేపీ అన్నది. ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది. ఈవీఎంలను ఎలా మేనేజ్ చేస్తారన్నది మాత్రం ఇప్పటి వరకూ చెప్పలేదు. ఏవేవో కుట్ర సిద్ధాంతాలతో చాలా మంది ఈవీఎంలతో తెరపైకి వచ్చి ప్రజల్ని నమ్మించాలని చూశారు. కానీ ఎవర్నీ నమ్మించలేకపోయారు. ఈవీఎంలతో అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే.. ఓడిపోయిన వారు మాత్రమే మాట్లాడటం. గెలిచిన వారు ఈవీఎంలు బాగున్నాయని చెప్పడం. కానీ దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఏదో ఓ సందర్భంలో ఈవీఎంలు వద్దన్నమే. మరి అందరూ ఒకే మాట మీద నిలబడి మళ్లీ బ్యాలెట్లు తీసుకు రావొచ్చు కదా. కానీ ఎవరికీ ఆ ఉద్దేశం లేదు. కేవలం ఓటమికి కారణంగా మాత్రమే చూపించడానికి ఈవీఎంలు ఉపయోగపడతాయి.
ఓటర్ల జాబితాలో లోపాలు కొత్తవా ?
ఓటర్ల జాబితాలో లోపాలు అనేవి కొత్తవి కాదు. మెట్రో సిటీల్లో ఇప్పటికిప్పుడు ఓటర్ల జాబితాను పరిశీలిస్తే…ఎన్నో లోపాలు బయటపడతాయి. ఓటర్ల జాబితాలో రాజకీయ పార్టీల ప్రమేయం, అధికార పార్టీల స్వార్థం, బీఎల్వోల నిర్లక్ష్యం.. చివరికి ప్రజలకు లెక్కలేకపోవడం వంటివి సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇవి బీజేపీ కుట్రలు కాదు. ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు వేలు, లక్షల ఓట్లు అక్రమంగా చేర్పించడం సాధ్యమేనా ?. ఒక్కరే నాలుగైదు చోట్ల ఓట్లు వేయడం సాధ్యమేనా ?. గతంలో వైసీపీ ఇలాంటి ప్రయత్నాలు చేసింది కానీ అడ్డంగా దొరికిపోలేదా ?. అలాంటి సాక్ష్యాలు చూపిస్తే ఎవరైనా నమ్ముతారు ?. కానీ ఈ లోపాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థపై పోరాడటం కరెక్టేనా ?
బీజేపీ పైనే పోరాడాలి..ఈసీపై కాదు !
నిజంగా ఈ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటే.. మహారాష్ట్రలో జాబితాలు బయట పెట్టాలి. హర్యానాలోనివి బయట పెట్టాలి. అదేమీ లేకుండా ఈడీపై పోరాడటం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది..? ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి ఎన్నికల సంఘం కాదు. ఎన్నికల సంఘం.. అధికారంలో ఉన్న పార్టీ చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయేలా చేసిందే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ప్రజలు ఎంతో చైతన్యవంతులయ్యారు. తప్పు జరిగితే గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ కే ఆ చైతన్యం ఇంకా వచ్చినట్లుగా లేదు. రాజకీయ పోరాటం ఎన్నికల సంఘం మీద చేస్తున్నారు.