తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఆ తర్వాత స్థానంలో నల్లగొండ నిలుస్తోంది. ఇటీవలి కాలంలో నల్లగొండలో మౌలిక సదుపాయాలు పెరగడం… అటు విజయవాడకు.. ఇటు హైదరాబాద్‌కు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.
నల్గొండ జిల్లాలో రోడ్లు, రవాణా సౌకర్యాలు, పరిశ్రమల అభివృద్ధి రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను బలోపేతం చేస్తున్నాయి. సూర్యాపేట ఔటర్ రింగ్ రోడ్ , ఖమ్మం బైపాస్ వంటి ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను మరింత పెంచాయి. ఇటీవల నల్గొండ హౌసింగ్ బోర్డ్ ప్లాట్లను వేలం వేసింది. భారీగా వెచ్చించి కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. చదరపు గజానికి రూ. 13,000 నుంచి రూ. 28,500 వరకు ధరలు పలికాయి. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అనుకోవాలి.
హౌసింగ్ బోర్డ్ కాలనీలు, వాణిజ్య కేంద్రాల సమీపంలోని ప్రాంతాలు, జాతీయ రహదారులకు సమీపంలోని ప్లాట్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు రూ. 20 వేల నుంచి రూ.30 వేల ధరలు పలుకుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కారణంగా సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకుంది. ఇక్కడ ధరలు రూ. 13,000. నుంచి 20,000 వరకు చ.గజం పలుకుతోంది.
నల్గొండ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడి దారులు, ఎన్ఆర్ఐలు , ఐటీ ఉద్యోగులు, భవిష్యత్ లాభాల కోసం ప్లాట్లు, భూములలో పెట్టుబడి పెడుతున్నారు. వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో కూడా, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కార్యాలయాలు, గిడ్డంగుల నిర్మాణం పెరుగుతోంది.