పులివెందులలో ఎన్నికలు అంటే అవి ఏవైనా సరే ఏకపక్షంగా గుద్దేసుకుంటారు. 99 శాతం ఓటింగ్ నమోదవుతుంది కానీ.. సొంతంగా ఓట్లేసేవాళ్లు తక్కువ. వాళ్ల బదులు ముఠాలు పనులు పూర్తి చేసేస్తూంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పటి వరకూ అంతే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. పులివెందుల జడ్పీటీసీకి ఉపఎన్నికలు తొలి సారి స్వేచ్ఛగా జరగబోతున్నాయి.
వైసీపీ రౌడీలను బైండోవర్ చేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పులివెందులతో పాటు ఒంటిమిట్టలోనూ పోలింగ్ జరుగుతోంది. పులివెందులలోని అన్ని పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగా ప్రకటించారు. ప్రతీ చోటా బలగాలతో పాటు పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంత కాలం భయంతో ఓట్లేసే ప్రజలు ఈ సారి ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేయనున్నారు. ఘర్షణలు సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.
గత వారం, పది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి రాలేదు. పూర్తిగా బెంగళూరుకే పరిమితమయ్యి.. పులివెందులలో ఎలా గెలవాలో స్కెచ్ వేస్తున్నారు. అయితే అవినాష్ రెడ్డి వల్ల కావడం లేదని.. విజయవాడతో పాటు పులివెందులలోనే స్కిట్లు ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఈసీ కార్యాలయం వద్ద ప్రతి రోజూ ఏదో ఓ పేరుతో రచ్చ చేస్తున్నారు. పులివెందులలో పెద్ద ఎత్తున డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. పరువు సమస్యగా మారడంతో వైసీపీ ఎప్పుడూ లేని విధంగా భారీగా డబ్బులు పంచుతూండటం అక్కడి ప్రజల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది.