టాలీవుడ్ నెలకొన్న తాజా పరిణామాలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. పని చేస్తూనే తమ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని, షూటింగ్స్ నిలిపివేయడం సరికాదని ఫిల్మ్ ఫెడరేషన్‌కు సూచించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు పట్టువిడుపులతో ఉండాలని, ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మరోవైపు టాలీవుడ్లో నెలకొన్న సమస్యలపై పలువురు నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో భేటి అయ్యారు. అనంతరం మంత్రి కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడారు. ఆందోళన నేపథ్యంలో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలని సూచించారు. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తామని, ప్రభుత్వ జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు.