లిక్కర్ స్కాంలో సీఐడీ సిట్ అనుబంధ చార్జిషీట్ ను దాఖలు చేసింది. అందులో చాలా అంటే చాలా వివరంగా స్కామ్ నగదు అంతా ఎటు పోయిందో.. ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారో వివరించారు. ఇంత డీటైల్డ్ గా వివరాలు సీఐడీ సిట్ కు ఎలా తెలుస్తున్నాయో తెలియక.. వైసీపీ క్యాంప్ కూడా ఆందోళన పడుతోంది. వారి అనుమానం విజయసాయిరెడ్డి మీదనే పడుతోంది. ఆయనే అంతా చెబుతున్నారని అనుమాన పడుతోంది.
విజయసాయిరెడ్డి అధికారికంగా అప్రూవర్ కాలేదు. కానీ ఆయన పూర్తి స్థాయిలో సిట్ కు సహకరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో విచారణకు రావాలని సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దానికి విజయసాయిరెడ్డి విచిత్రంగా స్పందించారు. మొదట వస్తానని సమాచారం ఇచ్చారు. తర్వాత తనకు తీరిక లేదన్నారు. పది రోజుల తర్వాత చూస్తానన్నారు. పది రోజులు దాటిపోయి చాలా రోజులు అయింది. సిట్ పట్టించుకోవడంలేదని అనుకుంటున్నారు. కానీ అధికారికంగా కాకుండా అనధికారికంగా అన్నీ చెబుతానని సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి ప్రతిపాదన పెట్టి అన్నీ చెబుతున్నట్లుగా అనుమానిస్తున్నారు.
విజయసాయిరెడ్డి జగన్ అక్రమ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి. మనీ ఎలా లాండరింగ్ చేస్తారో.. ఎవరు చేస్తారో ఆయనకు తెలుసు. లిక్కర్ స్కాంలో మొదట్లో విజయసాయిరెడ్డి కీలకంగా ఉన్నారు. తర్వాత రాజ్ కేసిరెడ్డి వచ్చి చేరారు. దాంతో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిపోయింది. అందుకే లిక్కర్ స్కాం కర్త, కర్మ, క్రియ రాజ్ కెసిరెడ్డి విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. ఇప్పుడు దాన్ని నిరూపించే సాక్ష్యాలను ఆయన పరోక్షంగా సిట్ కు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఎక్కడ తీగ లాగినా అది అంతిమ లబ్దిదారు వద్దకే చేరుతుంది. విజయసాయిరెడ్డి నేరుగా జగన్ గురించి చెప్పకపోయినా.. ఆయన ఇచ్చే వివరాలతో సిట్ అధికారులు తీగ లాగుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరుతోంది. అందుకే చార్జిషీట్లో ఆయన కనుసన్నల్లో జరిగిన విషయాన్ని సిట్ వివరంగా చెప్పిందని అనుకోవచ్చు.