ఈ వయసులోనూ జోరుగా సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటించిన ‘కూలీ’ ఈవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ అంచనాలతో నిండిన సినిమా ఇది. చాలామంది స్టార్లు తెరపై సందడి చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ‘కూలీ’ వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే లెక్కలు కట్టేశాయి. మరోవైపు ‘కూలీ’ ప్రమోషన్లలో భాగం పంచుకొంటూనే… మరోవైపు కొత్త సినిమాని సెట్ చేసుకొనే పనిలో పడ్డారు సూపర్ స్టార్ రజనీకాంత్.
‘జైలర్ 2’ షూటింగ్ ఓ వైపు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఓ కథని రజనీకాంత్ ఓకే చేశారని సమాచారం అందుతోంది. నటుడు, దర్శకుడు ఎం.శశి కుమార్ ఇటీవల రజనీకాంత్ ని కలిసి ఓ కథ చెప్పారని, ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. శశి కుమార్ ఈమధ్య ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన నటుడిగా చేసుకొంటూనే, అప్పుడప్పుడూ మెగాఫోన్ పడుతున్నారు. రజనీకాంత్ ని డైరెక్ట్ చేయాలన్నది శశికుమార్ కల. అందుకోసం కొన్నాళ్లుగా స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తరవాత హీరోగా ఆయనకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అయినా సరే… రజనీకాంత్ కోసం అవన్నీ పక్కన పెట్టి.. స్క్రిప్టుపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నాయి. రజనీని కలిసి కథ వినిపించడం, అది రజనీకి నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ దొరికింది. రజనీ కోసం మరి కొన్ని కథలు సిద్ధమవుతున్న తరుణంలో ‘జైలర్ 2’ తరవాత ఏ సినిమాని ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈక్వేషన్స్ అన్నీ కుదిరితే.. శశి కుమార్ సినిమాని ముందుకు తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.