మంత్రి పదవి రావడం ఇక కుదరదనే భావనతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మథన పడుతున్నారు. ప్రతి రోజూ..ప్రతి దానికి తన మంత్రి పదవితో ముడిపెట్టుకుని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకేం తక్కువని.. ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు. గత వారం రోజుల నుంచి రోజూ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతూ తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని చెబుతూనే.. ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు.
ఇవాళ కూడా అదే పని చేశారు. సామాజిక సమీకరణాల కోసమే తనకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నారని అంటున్నారని.. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని.. అక్కడ తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయన్నారు. మరి పదకొండు స్థానాలు గెలిచిన నల్లగొండలో ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేమిటన్నారు. తనకు మంత్రి పదవి హామీ ఇచ్చినప్పుడు ఇద్దరు సోదరులు ఉన్నారని తెలియదా అని కూడా ఆవేదనతో కూడిన స్వరాన్ని వినిపించారు. ఇద్దరు సోదరులు మంత్రులుగా ఉంటే తప్పా అని కూడా ప్రశ్నించారు.
ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. గ్రేటర్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం లేదు. ఈ విషయం ఆయన మర్చిపోతున్నారు. తన కు అనకూలంగా ఏ అంశం కరెక్ట్ గా ఉంటుందో దాన్నే ఎంచుకుని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ నేతలు పట్టించుకోవడం మానేశారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా .. కృష్ణారెడ్డి అనే మరో లీడర్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. అతను కోమటిరెడ్డి సోదరులకు బద్దవిరోధి.