పులివెందుల , ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల రక్షణతో మరోసారి నిర్వహించాలని జగన్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని పది రోజులుగా బెంగళూరు నుంచి ఇంటి రచించిన వ్యూహాలు చెల్లలేదని తెలిసిన తర్వాత కంగారుగా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అంతా రిగ్గింగ్ జరిగిందని ఊళ్ల మీద బయట నుంచి వచ్చిన వారు పడి స్లిప్పులు లాక్కుని వారే ఓట్లేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు రెండు చిన్న జడ్పీటీసీల కోసం అరాచకవాదిగా మారారని ఆరోపించారు.
రెండు, మూడు పేజీలు వచ్చేలా జగన్ రెడ్డి ఆర్తనాదాలు ఉన్నాయి. ట్వీట్ లో నంద్యాలను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు అప్పట్లో నంద్యాలలో అలాగే గెలిచారని కానీ తర్వాత తాము గెలిచామన్నారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని తనకు తాను సర్ది చెప్పుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన డీఐజీ కోయ ప్రవీణ్‌కు.. మాజీ ఎంపీ కంభం పాటి రామమోహన్ రావుతో బంధుత్వం కలిపేశారు. ఇలాంటి ఆరోపణల్లో తన మార్క్ మిస్ కానని నిరూపించుకున్నారు.
జగన్ రెడ్డి స్పందన చూసి వైసీపీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి. అసలు ఘోరంగా ఓడిపోతారని సర్వేలు చెప్పినప్పుడు గెలుస్తామని చెప్పి అందర్నీ బెట్టింగులు కాసేలా చేశారు. ఇప్పుడు సొంత గడ్డ.. కంచుకోట అయిన పులివెందులలో ప్రజలు తనకు ఓట్లేయరని ఇంత నమ్మకంగా.. ఓడిపోతామని చెప్పడం వారిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అనడం అంటే.. జగన్ రెడ్డి ఓటమి ఒప్పుకోవడమే. నిజానికి ఆయన పోలింగ్ జరగక ముందే ఈ ఆరోపణలు చేశారు. అప్పుడే వైసీపీ కార్యకర్తలకు సినిమా అర్థమైపోయింది. జగన్ రెడ్డి తన తండ్రి కట్టించి ఇచ్చిన కంచుకోటను కూడా నిలబెట్టుకోలేకపోతున్నాడని అందరికీ అర్థమైపోయింది. ఇక ఆయనను నమ్ముకున్న వారికి పట్టేది శంకరగిరి మాన్యాలే.