ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓట్లు వేసి వారి పాలకుల్ని ఎన్నుకోవడం. కానీ ఆ ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేమన్న ఉద్దేశంతో కొంత మంది నయా అరాచకవాదులు కొన్ని ప్రాంతాల్ని గుప్పిట పట్టేసి అక్కడి ప్రజల్ని భయభ్రాంతాలకు గురి చేసి.. ముఠాలను తయారు చేసుకుని రిగ్గింగులు చేస్తూ సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆ అరాచకం ఎప్పుడో ఓ సారి అంతానికి రావాల్సిందే. ఇప్పుడు పులివెందులలో అదే జరుగుతుంది. అన్ని ఇతర ప్రాంతాలతో పాటు పులివెందులలో కూడా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు. అది చిన్న స్థానిక ఎన్నికే కావొచ్చు కానీ పెద్ద మార్పునకు మొదటి అడుగు అనుకోవచ్చు.
స్వేచ్ఛా ఓటింగ్ కోసం ఎంతో మంది పోరాడారు – కానీ విఫలం !
పాలెం శ్రీకాంత్ రెడ్డి అని అదే ప్రాంతం నుంచి న్యాయమూర్తిగా పని చేసిన పెద్ద మనిషి కుమారుడు పులివెందులలో ఆరాచక పరిస్థితుల్ని చూసి మార్చాలనుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన గట్టిగా నిలబడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించింది. ఓ సారి ఎంపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఆయన కూడా వైసీపీ మార్క్ ఎలక్షనీరింగ్ ను నిలువరించలేకపోయారు. ఆయనపైనే దాడులు జరిగాయి. చివరికి ఆయన కూడా చేతులెత్తేసి.. వ్యాపారాలు చేసుకున్నారు. అలాంటి ఎంతో మంది పులివెందులలో ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. కానీ అక్కడ వైఎస్ కుటుంబం కట్టుకున్న ఓ ఫ్యాక్షన్ గోడ కారణంగా ఎవరికీ సాధ్యం కాలేదు.
ప్రజలు ఓట్లేస్తే తమకు ఓటమే అని గట్టి నమ్మకం
ప్రజాఅభిమానం తమకు ఎక్కువ అని వైఎస్ కుటుంబం భావిస్తూ ఉంటుంది. వైఎస్ అంటే పడి చస్తారని .. ఓట్లు వెల్లువలా వేస్తారని అనుకుంటారు. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంటుంది. అదేమిటంటే ఎలాగూ మీరే మాకు వేస్తారు కదా..మేమే వేసుకుంటాం.. మీరెవరూ పోలింగ్ కేంద్రాలకు రావొద్దని చెబుతారు. వాళ్లే వేసుకుంటారు. పోలింగ్ బూత్‌లలో.. బ్యాలెట్లే కాదు ఈవీఎంలు వచ్చినా వారి పోలింగ్ తీరు మారలేదు. నిజంగా ప్రజలు వచ్చి ఓట్లు వేస్తే తమకు ఓటువేయరన్న భయం వారికి ఉంది. అందుకే అలా చేశారు.
పులివెందుల ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రం మొత్తం తేవాలనుకున్న జగన్
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి పులివెందుల తరహా ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రం మొత్తం తీసుకు వస్తే ఇక తిరుగు ఉండదనున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో అరాచకాన్ని ప్రోత్సహించారు. మాచర్ల సహా ఎన్నో చోట్ల కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా దాడులు చేశారు. హత్యలు చేశారు. రాష్ట్రం మొత్తాన్ని భయకంపితుల్ని చేశారు. కానీ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు. ప్రజాస్వామ్యంలో పురుగుల్ని ఎలా ఏరివేయాలో తెలుసని చూపించారు. అయినా బుద్ది మార్చుకోవడం లేదు. కానీ మార్పు అంటూ మొదలైతే.. ఇలాంటి అరాచక రాజకీయాల్ని ప్రజాస్వామ్యం కనుమరుగు చేస్తుంది.