పులివెందులలో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దాంతో బుధవారం పోలింగ్ ప్రారంభమయింది. పోలింగ్ ప్రారంభమయ్యాక.. తాము ఆ రెండు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ బహిష్కరిస్తున్నామని అవినాష్ రెడ్డి ప్రకటించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో కేంద్ర బలగాల రక్షణలో పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసారు.
పులివెందులలో అవినాష్ రెడ్డి చేసిన హడావుడి తప్ప మిగతా అంతా ప్రశాంతమైన పోలింగ్ జరిగింది. అన్ని గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటేశారు. నిజంగా వైఎస్ కుటుంబంపై .. జగన్ పై పులివెందుల ప్రజల్లో అభిమానం ఉంటే వారికే ఓటు వేస్తారు. కానీ అవినాష్ రెడ్డి ఎందుకో కంగారు పడుతున్నారు. తమపై తమ ప్రాంత వాసులకు అభిమానం లేదని అనుకుంటున్నారు. ఎప్పట్లాగే రిగ్గింగ్ చేసుకునే చాన్సివ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా పరిస్థితి మారింది.
రేపు కౌంటింగ్ లో.. పులివెందుల జడ్పీటీసీని వంద లేదా రెండు వందల ఓట్లతో కోల్పోతే అప్పుడు అవినాష్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారో చెప్పడం కష్టం. ఎందకుంటే రెండు రీపోలింగ్ జరుగుతున్న బూత్‌లలో.. కనీసం పన్నెండు వందల ఓట్లు ఉన్నాయి. ఈ రెండు బూత్‌లే ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం పోలింగ్ జరిగింది పదిహినే పోలింగ్ బూత్‌లలోనే.
ఎంత లేదనుకున్నా.. పులివెందులలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. అలాంటప్పుడు ఫైట్ చేయాలి. లేదు అనుకుంటే.. ముందే బహిష్కరించి ఉంటే పరువు కాస్త నిలడేది.కానీ రీపోలింగ్ ను బహిష్కరించడం మరో మూర్ఖపు నిర్ణయం. ఈ రెండు పోలింగ్ బూత్‌లలో ఎలా చూసినా.. .కనీసం సగం ఓట్లు వస్తాయనుకున్నా. రేపు ఆ తేడాతో ఓడిపోతే…. పరువు గంగలో కలిసిపోతుంది.