ఆగస్టు 14… ఈ రోజు కోసం బాక్సాఫీసు చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఓ వైపు కూలీ, మరోవైపు వార్ 2 ఈ రోజే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొన్నాయి. రెండూ పెద్ద సినిమాలే. అయితే ఒకే రోజు వస్తాయా? వీటిలో ఒక్క సినిమా వెనుకడుగు వేస్తాయా? అని ట్రేడ్ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి. కానీ రెండు సినిమాలూ పట్టు విడవలేదు. చెప్పిన డేట్ కే… సమరానికి సిద్ధమయ్యాయి. ఈ సినిమాల్లో దేనికి ఎక్కువ హైప్.. దేనికి తక్కువ ఉంది? అనే డిబేట్ కూడా నడిచింది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ… ఈ రెండు సినిమాలూ సమవుజ్జీలే అనే సంగతి తేలిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు తెరిచారో… అప్పటి నుంచీ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం మొదలయ్యాయి. మల్టీప్లెక్స్ లో ఇప్పుడు టికెట్ దొరకడం లేదు. సింగిల్ స్క్రీన్ సంగతి సరా సరి. రేపు.. థియేటర్ల దగ్గర జాతర చూడడం ఖాయం. గురువారం సినిమా విడుదల అవుతోంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవులు. అంటే… ఈ రెండు సినిమాలకూ లాంగ్ వీకెండ్ దొరుకుతోందన్నమాట. ఇంతకంటే మంచి స్పాన్ దొరుకుతుందా? ఎన్టీఆర్ సినిమా ఎలాగున్నా జనం చూస్తారు. రజనీకాంత్ కూలీకి ఎలాగూ హైప్ ఉంది. బలమైన స్టార్ కాస్ట్ వుంది. పైగా వచ్చేవన్నీ సెలవులే. రెండు సినిమాలకూ కావాల్సినంత స్పేస్ దొరికినట్టైంది.
ఏపీలో పెరిగిన టికెట్ ధరలు కూలీ, వార్ 2లకు అదనపు అడ్వాంటేజీ. వార్ 2కైతే ప్రీమియర్ షోలకు అనుమతి వచ్చింది. టికెట్ ధర 500 రూపాయలు పెంచుకొనే ఛాన్స్ వచ్చింది. దీని వల్ల తొలి రోజు వసూళ్లలో కూలీ కంటే వార్ 2కే ఎడ్జ్ చూసే అవకాశాలు పుష్కలంగా కలిగాయి. ఏపీలో కూలీ టికెట్లన్నీ కార్పొరేట్ స్టైల్ లో బల్క్ బుకింగ్స్ చేశారు. సినిమాకున్న హైప్ దృష్ట్యా ఇలాంటి బల్క్ బుకింగులు చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు కృత్రిమ హైప్ సృష్టించడానికి కూడా ఇలాంటి పద్ధతి అవలంభిస్తుంటారు. వార్ 2తో పోలిస్తే కూలీకి ఎక్కువ హైప్ ఉందని చూపించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే రజనీకాంత్ సినిమాలకు ఆ అవసరం ఉండదు. కాబట్టి… ఇది హైప్ వల్ల జరిగిన బుకింగే అనుకోవాల్సి ఉంది.
ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రావడం వల్ల చాలా కాలం తరవాత థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ రెండు సినిమాలూ బాగుండి. ఈ నాలుగు రోజులూ థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తే చిత్రరంగానికి కొత్త ఉత్సాహం వస్తుంది.