ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలన్నింటినీ ఆరు నెలల్లో సంరక్షణా కేంద్రాలకు తరలించాలని బయట ఒక్కటి కూడా కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎప్పటికప్పుడు ఈ వీధి కుక్కల కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. అలాగే కుక్కలు పిల్లలు, పెద్దలపై దాడులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో వీధి కుక్కలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వ్యతిరేకించే జంతు ప్రేమికులు ఉంటారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి.
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కాఠిన్యం చూపిందంటున్న జంతు ప్రేమికులు
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జంతు ప్రేమికులు సహా కొంత మంది కి నచ్చలేదు. వారు సుప్రీంకోర్టు తీర్పును విమర్శిస్తున్నారు. కుక్కలను స్వేచ్చగా వదిలేయాలని వారంటున్నారు. సంరక్షణా కేంద్రాల్లో ఉంచడం.. వాటి సంతతిని నిరోధించే ప్రయత్నాలు చేయడం క్రూరత్వం కిందకే వస్తుందంటున్నారు. కొంత మంది మరీ అతిగా స్పందిస్తున్నారు. రేపిస్టులను సుప్రీంకోర్టువదిలి పెడుతుందని నోరు లేని కుక్కల్ని బంధించమని ఆదేశాలు ఇస్తోందని ఆవేశపడుతున్నారు. మనేకాగాంధీ పేరు మోసిన జంతు ప్రేమికులు ఒక్కో కుక్కని సంరక్షించడానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుందని లెక్కలు చెప్పారు. వీరి వాదనలు వీరు వినిపిస్తున్నారు. చివరికి రాహుల్ గాంధీ కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు భారీగా సమర్థన
అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు సామాన్య జనం నుంచి సమర్థత వస్తోంది. వీధి కుక్కల వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయని వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. రాను రాను వీధి కుక్కలు ప్రమాదకరంగా మారుతున్నాయని అంటున్నారు. వీటి విషయంలో ప్రతి రాష్ట్రంలోనూ.. ప్రతి పట్టణంలోనూ స్థానిక సంస్థలకు పిర్యాదులు ఉన్నాయని చెబుతున్నారు. తాము కూడా జంతు ప్రేమికులమే కానీ.. ఇలా కుక్కలు మనుషులపై పడి దాడి చేసేలా ఉంటే ఎలా సమర్థిస్తామని అంటున్నారు. వాటిని చంపేయమని చెప్పడం లేదని.. వీధుల్లో లేకుండా చూడాలని కోరుతున్నామని సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని అంటున్నారు.
వీధి కుక్కలను నియంత్రించడం సాధ్యమేనా ?
చాలా దేశాల్లో వీధి కుక్కలు అనేవి ఉండవు. పెట్స్ ఉంటే వాటికి యజమానులు బాధ్యత వహించాలి. ఎవరైనా వీధి కుక్కలకు అన్నం పెడితే వాటికి వారే యజమానులు అవుతారు. వీధి కుక్కలకు చాలా మంది బిస్కెట్లో.. మిగిలిన చికెన్ ముక్కలో వేసి.. గొప్ప సాయం చేశామని .. జంతు ప్రేమికులం అని అనుకుంటూ ఉంటారు. కానీ అవే ఇతరులపై దాడి చేసి కరిస్తే మాత్రం బాధ్యత తీసుకోరు. అయితే మన దేశంలో వీధి కుక్కలను నియంత్రించడం సాధ్యమా అంటే.. అసాధ్యం అని చెప్పుకోవాలి. ఆ సమస్యకు పరిష్కారం సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అని ఎక్కువ మంది అనుకోవడం లేదు. అందుకే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.