మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రి గా చేసినందుకు ఇప్పటికీ తిప్పలు తప్పడం లేదు. చెప్పినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆమె కేసుల్లో ఇరుక్కుకున్నారు. కింది కోర్టులో ఊరట లభించినా సీబీఐ వదిలి పెట్టడం లేదు. తాజాగా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా తో పాటు మాజీ ఐఏఎస్ కృపానందం ను నాంపల్లి కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వారు నేరానికి పాల్పడ్డారన్నదానికి సాక్ష్యాలు ఉన్నాయని నాంపల్లి కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది.
గతంలో హైకోర్టు ఐఏఎస్ శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేయడంతో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే తీర్పురాక ముందే.. హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారణ పూర్తి చేసి.. నిందితులకు శిక్ష విధించింది. హైకోర్టు శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేయడంతో శిక్ష ఖరారు చేయలేదు. తర్వాత సుప్రీంకోర్టు ఇలా కేసు నుంచి శ్రీలక్ష్మిని తప్పించిన హైకోర్టు తీర్పును కొట్టివేసింది. మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ జరిపిన హైకోర్టు.. ఆమెపై కూడా అభియోగాలపై విచారణ చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇప్పుడు సబితా, కృపానందంలపై కూడా హైకోర్టు విచారణ జరపనుంది. వారిని నేరుగా సీబీఐ కోర్టు తీర్పులోనే నిర్దోషులుగా ప్రకటించారు. అయితే వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయని సీబీఐ అంటోంది. వారు కూడా గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ దోపిడీకి సహకరించారని వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఒక వేళ సబితపై మళ్లీ ట్రయల్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే.. శ్రీలక్ష్మితో పాటు ట్రయల్ నిర్వహించి వేగంగానే సీబీఐ కోర్టు తీర్పు చెప్పే అవకాశాలు ఉన్నాయి.