కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేసినా కొంత రాజకీయం.. కొంత నిర్లక్ష్యం వల్ల దాసోజు శ్రవణ్ అవకాశం కోల్పోయారు. తమిళిసై కేబినెట్ సిఫారసులను వెనక్కి పంపడం .. మళ్లీ అవే పేర్లు సిఫారసు చేసే అవకాశం ఉన్నా కేసీఆర్ నిర్లక్ష్యం చేయడంతో చేతిలోకి వచ్చిన పదవి పోయింది. అయితే తర్వాత ఆయనను కేసీఆర్ కరుణించారు. ఎమ్మెల్యే కోటాలో అవకాశం దక్కిన ఒక్క స్థానాన్ని ఆయనకే కేటాయించారు.దాంతో ఇప్పుడు దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అయ్యారు.
అయినా అప్పటి గవర్నర్ నిర్ణయంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన పోరాటానికి కాస్త ప్రయోజనం లభించింది. తమ స్థానాలలో నామినేట్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీల పదవులను ఊడగొట్టగలిగారు. అయితే సుప్రీంకోర్టు.. అప్పట్లో కేసీఆర్ కేబినెట్ సిఫారసు చేసిన వారికే పదవులు ఇవ్వాలని చెప్పలేదు.పూర్తి ఆర్డర్ లో ఏ తీర్పు ఉంటుందో అని బీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. తాజాగా చేపట్టబోయే నియామకాలు కూడా తుది తీర్పునకు లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెబుతోంది
అలాంటి తీర్పు వస్తే దాసోజు శ్రవణ్ ఏం చేస్తారన్నది ఆసక్తికరం. ఎందుకంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల కాలం ఇప్పటికే దాదాపుగా మాడున్నరేళ్లు అయిపోయింది. ఇప్పుడు దాసోజుతో పాటు సత్యనారాయణకే పదవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఆరేళ్ల పదవి కాలం రాదు. కానీ ఆయన ఇటీవల శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ పదవి 2031 వరకు ఉంటుంది. అందుకే.. ఇప్పుడు దాసోజు శ్రవణ్.. ఆ పదవుల్ని తమకే ఇవ్వాలని సుప్రీంకోర్టు రూల్ ఇవ్వకూడదని ప్రార్థిస్తారనడంలో సందేహం లేదు. అలాగే తీర్పు వస్తే ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. ఒక్క స్థానానికే ఎన్నిక జరిగితే అది కాంగ్రెస్ ఖాతాలోకి పోతుంది