పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు అయింది. కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి 5,794 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. జగన్ రెడ్డి కంచుకోట లాంటి పులివెందులలోడిపాజిట్ కోల్పోవడం వైసీపీకి పెద్ద మానసిక దెబ్బ అనుకోచ్చు.
ఓటింగ్ లో తాము అనుకున్నట్లుగా ఎప్పటిలా రిగ్గింగ్ చేసుకోలేకపోవడంతో జగన్ రెడ్డికి ఫలితం అర్థమయింది. పెద్ద ఎత్తున డబ్బులు పంచినా ప్రయోజనం లేకపోయింది. ప్రజలు ఓట్లు వేస్తే తాము ఓడిపోతామని క్లారిటీ రావడంతో .. రిగ్గింగ్ నాటకాలు ప్రారంభించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో పరువు పోతుందని ఆరోపణలు ప్రారంభించారు. ఇంత కాలం తాము భయ పెట్టిన ఓటర్లు ఇప్పుడు స్వేచ్చగా ఓటు వేసి.. జగన్ రెడ్డికి బుద్ది చెప్పారు. ఒంటిమిట్టలోన టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అక్కడ కూడా టీడీపీ అభ్యర్థికి భారీ మెజార్టీ వస్తుంది.
ఈవీఎంలతో ఎన్నికలు జరిగినప్పుడు ఈవీఎంల మ్యానిపులేట్ అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు కాబట్టి రిగ్గింగ్ అంటున్నారు. ఓటములుకు వారికి కావాల్సింది.. ఓ కారణం మాత్రమేనని ఈ ఫలితంతో స్పష్టమయింది.