ఈరోజు ఓ సినిమా అవార్డుల ఫంక్షన్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిత్రసీమ వైఖరి పట్ల పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల టాలీవుడ్ కి ఏకంగా 8 జాతీయ అవార్డుల్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకేసారి 8 జాతీయ అవార్డులు రావడం అంటే మాటలు కాదు. నిజంగా టాలీవుడ్ కి గర్వకారణమైన క్షణాలు. అయితే… చిత్రసీమ తరపున అవార్డు గ్రహీతల్ని ఎవ్వరూ సన్మానించలేదు. అటు ఛాంబర్ కానీ, ఇటు ‘మా’ కానీ పట్టించుకోలేదు. అసలు ఇలాంటి అవార్డులు ఒకటి వచ్చాయని, వాళ్లకైనా తెలుసో లేదో?
సైమా కర్టెన్ రైజర్ లో.. అవార్డు గ్రహీతల్ని నిర్వాహకులు సన్మానించారు. నిజంగా టాలీవుడ్ ఏకమై చేయాల్సిన కార్యక్రమం ఇది. చేయలేకపోయారు. దీనిపైనే అరవింద్ తన విస్మయాన్ని, విచారాన్ని సభాముఖంగా వ్యక్త పరిచారు. ఇక్కడ ఎవరి కుంపటి వాళ్లదే అని, అందుకే ఎవరూ పట్టించుకోలేదన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టారు.
మనం ఇంతేగా. ఎప్పుడూ ఇలానే కదా ప్రవర్తించేది. ఇక్కడ ఎవరి వర్గాలు వాళ్లవి. ఎవరి గొడవలు వాళ్లవి. చిత్రసీమకు గర్వకారణమైన క్షణాల్ని సెలబ్రేట్ చేసుకోవడమే చాలా తక్కువ. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు. అది వ్యక్తిగత అవార్డులే అన్నట్టు లైట్ తీసుకొన్నారు. తెలుగులో ఓ హీరో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం అదే తొలిసారి. అలాంటప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా?
అంతెందుకు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు పట్టించుకొన్నారా? దేశంలోని రెండో అతి పెద్ద పురస్కారం అది. అయినా మనవాళ్ల కంటికి ఆనలేదు. పద్మభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవిని సన్మానించుకొన్నాం కదా అనే ఉద్దేశంతో మనవాళ్లు పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ 21 సీట్లలో విజయకేతనం ఎగరేసినప్పుడు టాలీవుడ్ నుంచి ఎలాంటి సన్మానాలూ, సత్కారాలూ లేవు. ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీతల్ని పట్టించుకొంటారా? ఈ విషయం అల్లు అరవింద్ కీ బాగా తెలుసు. కానీ.. పెద్ద మనిషి కదా. లోపల ఆవేదన ని దాచుకోలేక బయటపడిపోయారు.