స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు పథకాన్ని మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో అత్యంత కీలకమైన హామీ అయిన ఈ ఉచిత బస్సు పథకం కోసం గత ఏడాదిగా కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి మహిళలకు సంతృప్త స్థాయిలో సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. అధికంగా బస్సులు కొనుగోలు చేశారు. సిబ్బందిని నియమించుకున్నారు.
రాష్ట్రం మహిళలకు ఉచిత ప్రయాణాలు
ఇప్పటి వరకూ ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో మెట్రో సిటీలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. మహిళలు దూర ప్రాంత ప్రయాణాలను ఎక్కువగా వినియోగించుకుంటారు. అందుకే ఏపీ ప్రభుత్వంపై మరింత భారం పడుతుంది. అయినా వెనుకడుగు వేయకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం భారం అవుతుందన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలోనే జిల్లాల సరిహద్దు వరకు అనే నిబంధన పెట్టారు. కానీ తర్వాత విశ్లేషించుకుంటే.. ఎనభై శాతం మందికిపైగా జిల్లాల పరిధిలోనే ప్రయాణిస్తారని తేలింది. అందుకే పథకంపై ఆంక్షలు పెట్టారన్న విమర్శలు ఎదుర్కోవడం ఎందుకన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
ఆర్థికంగా బలపడనున్న మహిళలు
ఈ పథకం ఇతర పథకాల్లా ఉచిత పథకం కాదు. దీని వల్ల మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుతుంది. ముఖ్యంగా విద్య, ఉపాధి కోసం అటూ ఇటూ తిరగాల్సిన వారికి ఖర్చులు మిగులుతాయి. అవి వారికి ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. ఇప్పటికే చిరుద్యోగులు, చిరు వ్యాపారుల కోసం అన్న క్యాంటీన్లు ఉన్నాయి. వారికి డబ్బులను మిగల్చడం ద్వారా .. ఆయా కుటుంబాలను ఆర్థికంగా బలపరచడానికి అవకాశం ఏర్పడుతుంది.
సంపద పెంచుకుంటూ పథకాల అమలు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి.. జగన్ రెడ్డి చేసి పోయిన నిర్వాకాల కారణంగా ఇబ్బందికరంగానే ఉంది. కానీ చంద్రబాబు వీలైనంత వరకూ ఆదాయ మార్గాలను పెంచుకుంటూ.. సర్దుబాటు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన పథకాలను అమలు చేస్తూ పోతున్నారు. ఇప్పటి వరకూ పథకాల అమలు సంతృప్తికరంగా సాగుతోంది. ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ప్రజల్ని సంతృప్తి పరుస్తోంది. నేరుగా ప్రజలకు ప్రత్యక్ష లాభం వచ్చేలా చేసే పథకాలు కావడం ప్లస్‌గా మారింది.