ఎగువ నుంచి వచ్చే వరద వల్ల జరిగే నష్టాన్ని ఏపీ భరించాలి కానీ.. ఆ వరద నీటిని మాత్రం మళ్లించుకోకూడదా.. అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ఆయన.. బనకచర్ల విషయంలో ఇప్పటి వరకూ బయటకు రాని అంశాన్ని స్పృశించారు. వరద నీటిని తాము మళ్లించుకుంటే తెలంగాణకు ఏం నష్టమని ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడుకొత్త వరద దిగువ రాష్ట్రమైన ఏపీకి జరుగుతున్న నష్టం అంశాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చారు. ఇది ఆసక్తికరంగా మారింది.
గోదావరికి వరదలు వస్తే.. అది ఏపీలో పడే వర్షాల వల్ల కాదు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడితే.. ఆ నీరు దిగువకువస్తాయి. ఎగువ రాష్ట్రాలు తమ సామర్థ్యం మేర ఆపుకుంటాయి. మిగతావే కిందకు వస్తాయి. కాళేశ్వరం ద్వారా తెలంగాణ ఎత్తిపోసుకోవచ్చు. కానీ ప్రాజెక్టులో లోపాల కారణంగా పరిమితంగానే ఎత్తిపోసుకుంటున్నారు. ఎక్కువ నీరు దిగువకు వచ్చేస్తోంది. ఏపీపై పడుతోంది. దీని వల్ల ఏపీలో కొన్ని గ్రాములు మునుగుతున్నాయి. గోదావరి ముంపు ఏపీకి సమస్యగానే ఉంది. ఈ ముంపును ఏపీ భరించాలి కానీ.. ఆ నీటిని మాత్రం వాడుకోవద్దనడం ఏమిటని చంద్రబాబు తాజా ప్రశ్న.
నేరుగా సముద్రంలోకి పోయినా పర్వాలేదు కానీ.. ఏపీ వాడుకోకూడదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి చంద్రబాబు ఇలా కౌంటర్ ఇస్తున్నారు. గోదావరి మీద తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కావాలంటే అన్ని ప్రాజెక్టులు కట్టుకుని నీటిని మళ్లించుకోవాలని.. తామేమీ అభ్యంతరం చెప్పబోమని చంద్రబాబు అంటన్నారు. దిగువ రాష్ట్రం ఇలాంటి ఆఫర్ ఇస్తే.. సంతోషించాల్సిన ఎగువ రాష్ట్రం.. అయినా సరే.. సముద్రంలోకి వెళ్లే నీళ్లను వాడుకోవద్దని రాజకీయం చేస్తోంది. చంద్రబాబు అడిగిన దానికిఇప్పుడు తెలంగాణ సమాధానం చెప్పాల్సిన ఉంది.