ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆగస్టు 15 రెండు పండుగలు జరిగాయి. ఒకటి స్వాతంత్ర్య దినోత్సవం అయితే.. రెండు స్త్రీ శక్తి పథకం ప్రారంభం. ఏపీలో ఉన్న రెండు కోట్ల మందికిపైగా మహిళలు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే పథకాన్ని చంద్రబాబు, పవన్,లోకేష్ ప్రారంభించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఇక నుంచి శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
దాదాపుగా ఎనిమిది వేలకుపైగా బస్సుల ఈ పథకం కోసం రెడీ చేశారు. మహిళల సీట్లలో మగవాళ్లు కూర్చోకుండా ప్రత్యేకంగా సీటింగ్ కు రంగులు వేశారు. డిమాండ్ ను బట్టి సర్వీసులు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో పథకాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు ఉండవల్లి నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించారు. బస్సులోనే పవన్ కల్యాణ్, నారా లోకేష్ కూడా ఉన్నారు. పలు స్టాపుల్లో మహిళలు ఎక్కారు. వారు చంద్రబాబు, పవన్, లోకేష్ తో మాట్లాడుతూ కనిపించారు. దారి పొడవునా మహిళలు బస్సుకు స్వాగతం పలికారు.
విజయవాడ బస్ స్టేషన్ లో .. పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆధార్ కార్డు లేదా ఏ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు అయినా సరే చూపించి ఉచిత టిక్కెట్ తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఈ పథకం వల్ల మహిళలకు నెలకు రూ. పదిహేను వందల వరకు ఆర్థికంగా మేలు జరుగుతుందని నారా లోకేష్ అన్నారు. ఏడాదికి రెండు వేల కోట్ల వరకూ ఈ పథకం కోసం ప్రభుత్వం వెచ్చిస్తుందని .. చంద్రబాబు నాయకత్వ సామర్థ్యానికి ఈ పథకం అమలు నిదర్శనమన్నారు. సూపర్ సిక్స్ హామీైలు సూపర్ హిట్ అయ్యాయని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు పండుగలా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూపురంలో బాలకృష్ణ స్వయంగా బస్సు నడిపారు.