మెగా హీరోలతో మారుతికి మంచి అనుబంధం ఉంది. శిరీష్, సాయిధరమ్ తేజ్‌లతో ఇది వరకే సినిమాలు తీశారాయన. సాయిధరమ్ తో చేసిన ‘ప్రతీ రోజూ పండగే’ మంచి హిట్. ఇప్పుడు సాయి ధరమ్ తోనే మరో ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కి మారుతి దర్శకుడు కాదు. నిర్మాత మాత్రమే.
సాయిధరమ్ కోసం మారుతి ఓ కథ రాసుకొన్నారు. ఈ కథని మరో దర్శకుడు వంశీ చేతుల్లో పెట్టారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రానికి దర్శకత్వం వహించారు వంశీ. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అప్పట్నుంచి ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు అతని చేతికే ఈ ప్రాజెక్ట్ వెళ్లినట్టు సమాచారం. మారుతి ఈ చిత్రానికి సూపర్ వైజర్ గా ఉంటారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తారు. కథ, కథనం, మాటలు కూడా ఆయనవే. ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో బిజీగా ఉన్నారు సాయిధరమ్ తేజ్. ఇది పూర్తయిన వెంటనే మారుతి ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా మారుతి బ్యానర్లో మరో 5 సినిమాలు కూడా పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.