బీహార్లో సుదీర్ఘమైన నితీష్ కుమార్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉందని అన్ని రాజకీయ పార్టీలకు క్లారిటీ ఉంది. ఆయనను ఈ సారి సాగనంపే ఉద్దేశంలోనే ప్రజలు ఉన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కూటమి ఏం చేయాలి ?. ఆ ప్రజాగ్రహాన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఓట్ల చోరీ అంటూ కొత్త రచ్చ ప్రారంభించి అసలు సమస్యలపై కాకుండా కొసరు సమస్యలపై పోరాటం చేస్తోంది. దీంతో ప్రజలతో కనెక్షన్ పోగొట్టుకుంటోంది.
ఓట్ల చోరీ అంటే ప్రజలు నమ్మేసి ఓట్లేస్తారా ?
ఓట్ల చోరీ అంటే ప్రజలు తమను నమ్మేసి తమకు ఓటేస్తారని ఎందుకు అనుకుంటున్నారో కానీ.. రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించారు. దానికి జేడీయూ మద్దతు పలికింది. అందరూ కలిసి యాత్ర చేస్తున్నారు. ఓటు ఉన్న వారికి ఈ ఓటు చోరీ యాత్ర రిజిస్టర్ కాదు. తమ ఓటు చోరీ కాలేదు కదా అనుకుంటారు. ఓట్లు లేని వాళ్లు చాలా స్వల్పంగా ఉంటారు. డబుల్ ఓట్లు, చనిపోయిన వాళ్ల ఓట్ల కోసం పోరాడితే సాధించేదేమీ ఉండదు. ప్రజా సమస్యలను , ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతపై చర్చ జరగకుండా చేసుకుంటున్నారు.
బీహార్ ప్రజలకు తాయిలాలు ఇస్తున్న నితీష్ కుమార్
కాంగ్రెస్, ఆర్జేడీ దారి తప్పాయని అర్థం చేసుకున్న నితీష్ కుమార్ .. తన ప్లాన్ అమలు చేస్తున్నారు. బీహార్ ప్రజల మైండ్ సెట్ ఆయనకు బాగా తెలుసు. అందుకే తాయిలాలు ప్రారంభించారు. రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాన్ని ఇచ్చారు. ఉద్యోగార్థులకు వంద రూపాయలే అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు. ఇంకా పలు పథకాల అమలును ప్రారంభించారు. ఇవన్నీ అక్కడి ప్రజలకు తాత్కలిక లబ్ది చేకూరుస్తాయి. కానీ ఓట్లను కురిపించేవి కూడా ఇవే. నితీష్ ఓట్ల చోరీ ఆరోపణల్ని పెద్దగా పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్తున్నారు.
ఈ సారి కూడా బీహార్ ను కోల్పోతే రాహుల్ రాజకీయానికి పనికి రానట్లే!
లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారు. ఆయన కుమారుడు తేజస్వియాదవ్ రాహుల్ బాటలో నడుస్తున్నారు. ఇప్పుడు ఆయనకు చాయిస్ లేకుండా పోయింది. బీహార్ లో ఎలాంటి అంశాలపై పోరాడాలో ఆయనకు తెలిసినా రాహుల్ బాటలో బలవంతంగా నడవాల్సి వస్తోంది. ఎన్నికల బహిష్కరణ పై ఆలోచిస్తున్నామంటూ ఆయన చేసిన ప్రకటన పూర్తిగా నెగెటివ్ వేలో ప్రజల్లోకి వెళ్లిపోయింది. వందశాతం గెలవాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ఓట్ల చోరీ పేరుతో పస లేని వాదనతో రచ్చ రచ్చ చేసి.. వదిలిపెడుతోంది. అసలు ప్రజలతో కనెక్షన్ ఉండే రాజకీయాలు చేయకుండా ఇలా వెళ్లి రేపు ఓడిపోతే.. మళ్లీ ఓట్ల చోరీపై ఆరోపణలు చేసుకుని సంతృప్తి పడాల్సిందే. కానీ రాజకీయంగా మళ్లీ కోలుకోలేరు. కాంగ్రెస్సే కాదు..లాలూ కుమారుడు కూడా !