రాజాసింగ్ ఇక తనకు బీజేపీతో సరిపడదని రాజీనామా చేశారు. అంత కంటే కావాల్సిందేముందని బీజేపీ పెద్దలు ఏ మాత్రం ఆలోచించకుండా రాజీనామా ఆమోదించేశారు. ఇక దాంతో బీజేపీకి, రాజాసింగ్ కు సంబంధాలు కట్ అయిపోయాయి. ఆయన గురించి ఆలోచించే తీరిక బీజేపీకి లేదు.కానీ రాజాసింగ్ మాత్రం ఎల్లప్పుడూ బీజేపీ గురించే ఆలోచిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే గ్రూపిజం ఉండకూడదని కొత్తగా సలహాలిస్తున్నారు.
బీజేపీలో భారీగా చేరికలు ఉండబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అలా చేరవద్దని..బీజేపీలో చేరాలంటే.. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఊహించుకోవాలని ఆయన నేతలకు సలహాలిస్తున్నారు. స్వతంత్రంగా ఉండలేరని.. పార్టీలో గ్రూపులు ఉంటాయని.. చాలా మంది ఇమడలేకపోయారని అంటున్నారు. రాజాసింగ్ ఉద్దేశం బీజేపీలో నేతలు చేరకుండా చేయడం మాత్రమే కాదు.. పార్టీలో తనను ప్రోత్సహించని వారిపై పగ తీర్చుకోవడం కూడా టార్గెట్ గా పెట్టుకున్నారు.
మళ్లీ తాను పార్టీలోకి రాకుండా కొంత మంది అడ్డుకుంటున్నారని రాజాసింగ్ భావిస్తున్నారు. తనకు బీజేపీ మాత్రమే సరైనదని.. పెద్దలు పిలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించనని ఇప్పటికే చెప్పుకున్నారు. కానీ ఆయనను పిలిచే ఉద్దేశం ఎవరికీ లేదు. ఆయన కోసం తెలంగాణ బీజేపీలో.. ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నా… ఇప్పుడల్లా మళ్లీ రాజాసింగ్ ను పార్టీలోకి వచ్చేందుకు హైకమాండ్ కూడా అంగీకరించే అవకాశాలు లేవన్న సూచనలు కనిపిస్తున్నాయి.