టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె పదిహేనో రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాలు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రావడం లేదు. ఈ రోజు కూడా సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవితో కార్మిక ప్రతినిధుల సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కార్మిక సంఘాల నుంచి దాదాపు డెబ్బై మంది ప్రతినిధులు చిరంజీవి నివాసంలో కొనసాగిన సమావేశానికి హాజరయ్యారు. ప్రతి క్రాఫ్ట్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. కార్మిక ప్రతినిధుల సమావేశంలో చర్చించిన అంశాలు, పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఫిల్మ్ ఛాంబర్ ముఖ్యులతో చిరంజీవి చర్చించనున్నారు.
అంతకుముందు ఫిల్మ్ ఛాంబర్లో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో నిర్మాతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. దిల్ రాజు, సి.కళ్యాణ్, నాగ వంశీ, బోగవల్లి బాపినీడు, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. నిర్మాతలు అందరం కలిసి సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్‌కి అప్పగించామని నిర్మాత సి.కళ్యాణ్ మీడియాకు చెప్పారు.
ఛాంబర్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని ప్రకటించినందున..ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ముఖ్యులతో చిరంజీవి నిర్వహించబోయే సమావేశమే అత్యంత కీలకంగా మారింది. మొత్తానికి చిరు ఎంట్రీతో సినీ పరిశ్రమలో నెలకొన్న సమ్మెకు శుభం కార్డ్ పడుతుందేమో చూడాలి.