చాలా కాలంగా జైల్లో ఉన్న వైసీపీ నేతల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయి. ఆయనకు చివరి కేసులోనూ బెయిల్ వచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. మొత్తం ఆయనపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అన్నింటిలోనూ బెయిల్ తెచ్చుకున్నారు. దాదాపుగా రెండున్నర నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. బయటకు వస్తారా లేకపోతే..ఏదైనా కేసు పెండింగ్ లో ఉందా అన్నది మంగళవారం తెలిసే అవకాశం ఉంది.
అదే సమయంలో లిక్కర్ కేసులో జైల్లో ఉన్నవారంతా.. బెయిల్స్ కోసం పిటిషన్లు వేసుకుని .. పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్టార్ రేటింగ్ లాయర్లతో వాదించుకుని తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి ఇవాళ తీర్పు వచ్చింది. కానీ ఒక్కరికీ బెయిల్ రాలేదు. అందరి బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చార్జిషీటు కూడా దాఖలు చేశారు కాబట్టి తమకు బెయిల్ వస్తుందని వారు ఆశలు పెట్టుకున్నారు. కానీ తవ్వాల్సింది చాలా ఉందని వారు బయటకు వస్తే దర్యాప్తుకు ఆటంకాలు కలిగిస్తారని ఏసీబీ తరపు లాయర్లు వాదించడంతో రిలీఫ్ రాలేదు. వారు ఇక పైకోర్టుకు వెళ్లాల్సిందే.
లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఇప్పుడు కీలక దశలో ఉంది. సూత్రధారి వద్దకు కేసు వెళ్తోంది. త్వరలో ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ.. వీరెవరికీ బెయిల్స్ వచ్చ అవకాశాల్లేవని అంచనా వేస్తున్నారు.