బీహార్లో ఓట్ల చోరీ అంటూ పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం గొప్ప అవకాశం ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా ఎన్నికల సంఘం ఇటీవల చేయించిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తీసివేసిన 65 లక్షల ఓటర్ల జాబితాను ప్రకటించింది. వెబ్ సైట్లో అందుబాటులోకి తెచ్చింది. బీహార్ వ్యాప్తంగా బూత్ స్థాయిలోనూ అందుబాటులో ఉంచుతోంది. ఇప్పుడు ఆ అరవై ఐదు లక్షల ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్, కాంగ్రెస్, ఆర్జేడీ నిరూపించాల్సి ఉంది.
బీహార్లో 65లక్షల ఓట్ల తొలగింపుపై ఇప్పుడు నిజానిజాలు
బీహార్లో ఉన్న ఏడున్నర కోట్ల మంది ఓటర్లలో అరవై ఐదు లక్షల మంది చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు , డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తొలగించారు. ఇప్పుడు వారి పేర్లు అన్నీ ఆన్ లైన్ లో పెట్టారు. బూత్ లలో అందుబాటులో ఉంచుతున్నారు. వీరంతా అసలైన ఓటర్లు అని.. వీరిని తొలగించి బీజేపీకి మేలు చేయడానికేనని.. కాంగ్రెస్ వాదిస్తోంది. ఆ తొలగించిన ఓటర్లు ఉన్నారని.. లక్షల ఓట్లను ఈసీ గల్లంతు చేసిందని ఇప్పుడు నిరూపించాల్సింది రాహుల్ గాంధీనే. ఎందుకంటే ఆయన అడిగిన సమాచారం అంతా.. ఈసీ ఆయన ముందు పెట్టింది.
నిరూపించలేకపోతే రాజ్యాంగ వ్యవస్థపై కాంగ్రెస్ దాడి చేసినట్లే !
సమగ్ర ఓటర్ జాబితా సవరణ అనేది అత్యవసరం. ఓటర్ల జాబితాలోని లోపాల కారణంగా ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోంది. అసలు అలాంటి లోపాలు టెక్నాలజీ పెరగక ముందు ఉన్నాయంటే సరే.. ఇప్పుడు ఆధార్ లాంటి అనుసంధానిత వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా అలాంటి ఓటర్లు ఉండటం చిన్న విషయం కాదు. పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు ఎప్పటికప్పుడు ఏదో ఓ అడ్డంకి వస్తూనే ఉంది. ఆధార్ తో అనుసంధానం కూడా ఐచ్ఛికమే అయింది కానీ.. నిర్బంధం కాదు. దీన్ని ఉపయోగించుకుని రాజకీయ పార్టీలే అక్రమాలకు పాల్పడుతున్నాయి. కానీ నిందలు మాత్రం ఎన్నికల సంఘంపై వేస్తున్నారు.
ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి పునాది వంటిది !
రాహుల్ గాంధీ తెలిసి చేస్తున్నారో.. విదేశీ కుట్రలో భాగమయ్యారో చెప్పలేం కానీ.. . కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తోంది భారత ప్రజాస్వామ్య పునాదులపైనే. ఎన్నికల వ్యవస్థ నమ్మకం మీద నడుస్తోంది. ఈ నమ్మకాన్ని దెబ్బతీయడం అంటే చిన్న విషయం కాదు. దేశాన్ని గందరగోళంలోకి నెట్టడమే. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అప్రతిహతంగా ఏలినప్పుడు కూడా ఎన్నికల సంఘం ఇలాగే పని చేసింది. శేషన్ లాంటి అధికారులు మళ్లీ రాకపోవడమే దీనికి కారణం. అంత మాత్రాన మొత్తం ఎన్నికల వ్యవస్థను తప్పు పట్టడం దేశానికి ప్రమాదకరం. చేసిన ఆరోపణల్ని నిరూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది.