ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తమ కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన రిటైర్డ్ సుప్రీకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. డీఎంకేకు చెందిన ఎంపీ తిరుచ్చి శివ పేరును ఖరారు చేస్తారని అనుకున్నప్పటికీ.. ఎలాంటి ఆశల్లేని పదవికి పోటీ చేయకపోయినా పోయేదేమీ లేదని పార్టీలన్నీ లైట్ తీసుకున్నాయి. చివరికి కూటమి బలాన్ని చూపేలా.. అటూ ఇటూ కాకుండా ఉన్న బీఆర్ఎస్, వైసీపీల బండారం బట్టబయలయ్యేలా చేయడానికి సుదర్శన్ రెడ్డిని ఖరారు చేశారు.
ఏ కూటమిలో పార్టీలు.. ఆ కూటమి అభ్యర్థులకు ఓట్లేస్తాయి. ఏ కూటమిలో లేని పార్టీలకే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి . తెలంగాణకు చెందిన వ్యక్తికి కాంగ్రెస్ కూటమి నిలబెడుతున్నందున బీఆర్ఎస్ పార్టీకి మరో చాయిస్ లేదు. తమ కు ఉన్న నలుగురు ఎంపీలతో కాంగ్రెస్ కూటమికి .. ప్రాంతీయ అభిమానంతో అయినా ఓటు వేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటింగ్ బహిష్కరించినా సరే… అది బీజేపీకి మేలు చేసినట్లే అవుతుంది. ఇక ఏపీలోని వైసీపీ కూడా..రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే మద్దతుగా ఉన్న వర్గంలోనే డౌట్స్ వస్తాయి.
మద్దతిచ్చినా గెలిచే అవకాశం లేదు కాబట్టి తాము బీజేపీకే మద్దతిస్తామని అతి తెలివిని వైసీపీ ప్రదర్శించే అవకాశం ఉంది. కానీ తమ ప్రత్యర్థులు ఉన్న కూటమికి మద్దతు పలకడం అంటే దివాలాకోరు తనమే. గెలుస్తారు కదా అని అన్ని పార్టీలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయవు కదా. ఎవరి ఐడెంటీటీని వాళ్లు కాపాడుకోవాలి. కానీ జగన్ రెడ్డి.. వైసీపీ చూపించే అతి తెలివితేటలకు చెక్ పెట్టేందుకు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఉపయోగపడనుంది.