సాధారణ బొతిక్ నడిపే మహిళ అయిన నెల్లూరు అరుణ హోంశాఖ సెక్రటరీని కూడా ఎలా ప్రభావితం చేయగలిగింది?. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలా చక్రం తిప్పగలిగింది?. అనేది చాలా మందికి అర్థం కాని విషయం. ఆమె ధనవంతురాలు కాదు. మొదట్లో చిన్న టైలర్ షాప్ మాత్రమే ఉంది. అందుకే పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండదు. మరి ఆమె ఎలా పలుకుబడి సాధించింది ?. ఈ డౌట్ కు ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తున్న పోలీసులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఆమె ప్రధాన ఆయుధం హనీ ట్రాప్‌గా అనుమానిస్తున్నారు.
నేతలు, అధికారులపై హనీ ట్రాప్
నెల్లూరు అరుణ ..వైసీపీ హయాంలో ఏకంగా ఓ ఎస్పీని గుప్పిట్లో పెట్టుకున్నారు. దిశ ప్రచార యాప్ కు.. ప్రచారకురాలిగా ఉన్నారు. ఆ చిన్న హోదా కోసం ఏకంగా ఎస్పీనే సిఫారసు చేశారని తెలుస్తోంది. అప్పట్నుంచి ఆమె పోలీసు వ్యవస్థతో ఓ ఆటాడుకున్నారు. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ కావాలో ఇప్పించుకునేవారు. చివరికి జైలు నుంచి పారిపోయిన శ్రీకాంత్ ను నాలుగున్నరేళ్ల పాటు దందాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అంతా అరుణ ప్రభావమే. చివరికి మళ్లీ జైలుకు పంపారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ ఏడాది తర్వాత నుంచి పాత పరిచయాలతో దందా ప్రారంభించారు.
హనీ ట్రాప్‌తో బెదిరింపులకు పాల్పడుతోందా ?
ఇద్దరు ఎస్పీలు వద్దని చెప్పినా నేరుగా హోంసెక్రటరీ నుంచి పెరోల్ ఆదేశాలు వచ్చాయంటే చిన్న విషయం కాదు. ఆమె ఏ స్థాయిలో ప్రభావితం చేసి ఉంటారో చెప్పాల్సిన పని లేదు. నెల్లూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి సిఫారసు లేఖలు తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. నెల్లూరులో వైసీపీకి ఎమ్మెల్యేలు లేరు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎవరు.. ఆమె ప్రియుడి పెరోల్ కోసం ఎందుకు సహకరించాల్సి వచ్చిందన్నది తేలాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యేలు చెబితేనే హోంసెక్రటరీ పెరోల్ ఇవ్వరు. ఏ స్థాయి ఉన్నతాధికారి ఆమె కోసం పెరోల్ మంజూరు చేయించాడో తెలియాల్సి ఉంది. డబ్బులు ఇవ్వడం కన్నా హనీ ట్రాప్ బెదిరింపుల ద్వారానే ఆమె పనులు చేయించుకుంటోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో హెచ్చరికలు
నెల్లూరు అరుణ సోషల్ మీడియాలో చేస్తున్న హెచ్చరికలు సంచలనంగా మారుతున్నాయి. శ్రీకాంత్ తో పనులు చేయించుకున్న వారంతా సైలెంట్ గా ఉంటున్నారని.. వారంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వారు నోరు విప్పుతారా.. తాను అంతా బయట పెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఆమె దగ్గర చాలా విషయాలు ఉన్నాయని అర్థమయిపోతోంది. ఆమె బయటపెడుతుందా..లేకపోతే వాటంతట అవే బయటకు వస్తాయా అన్నది తెలియదు కానీ.. ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయని.. ఎవరు సాయం చేసినట్లుగా తేలినా కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.